రీజెన్సీలో ‘ఆర్ టేబుల్ 94 2.0 – నమస్తే ఫ్రాన్స్; బొంజోర్ ఇండియా’
హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 22 : భారత్ – ఫ్రాన్స్ చిరకాల స్నేహ బంధాన్ని చాటి చెప్తూ ఖైరతాబాద్‌లోని ఎర్ర మంజిల్ వద్ద ఉన్న రీజెన్సీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ వేదికగా ‘ఆర్ టేబుల్ 94 2.0 – నమస్తే ఫ్రాన్స్; బొంజోర్ ఇండియా’ పేరిట నిర్వహించిన రెండు రోజుల అంతర్జాతీయ సాంస్కృతిక, పాకశాస్త్ర వేడుక వైభవంగా ముగిసింది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ప్రతినిధి బృందానికి భారతదేశ చారిత్రక ప్రస్థానం, సాంస్కృతిక సంప్రదాయాలు, ప్రాంతీయ వైవిధ్యం, ఆహార వారసత్వ ప్రత్యక్ష అనుభూతిని అందించింది. ఆహారం, సంస్కృతి, ఆతిథ్యం అనే అంశాల ద్వారా రెండు శక్తివంతమైన సంస్కృతులను ఏకం చేస్తూ భారత్ – ఫ్రాన్స్ దేశాల మధ్య ఉన్న చిరకాల స్నేహాన్ని ఇది చాటి చెప్పింది. ఈ సందర్భంగా రీజెన్సీ కాలేజ్ ప్రిన్సిపాల్ పీ రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హాస్పిటాలిటీ విద్యలో అంతర్జాతీయ అనుభవం, ప్రయోగాత్మక అభ్యాసానికి ఎనలేని ప్రాధాన్యత కలదన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల దృక్పథాన్ని, సాంస్కృతిక, అంతర్జాతీయ ఆతిథ్య ప్రమాణాలపై అవగాహన కల్పిస్తాయన్నారు. తద్వారా వారిని ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలకు సిద్ధం చేస్తాయన్నారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకను విజయవంతంగా నిర్వహించడంలో అంకితభావంతో పని చేసిన యాబై మంది మూడో సెమిస్టర్ బీసీటీసీఏ విద్యార్థులు, గ్యాస్ట్రోనమీ బృందాలు, స్టూడెంట్ క్లబ్‌లు, అధ్యాపకులు, సహాయక సిబ్బందిని అభినందించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జీన్-పియర్ రేనాడ్ (ఏఏఎన్ఏ & వైస్-ప్రెసిడెంట్, నోవెల్లె-అక్విటైన్ – బోర్డియక్స్ రీజియన్) మాట్లాడారు. భారతదేశ చారిత్రక వారసత్వం, తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు, పాకశాస్త్ర నైపుణ్యాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించిన విద్యార్థులు, అధ్యాపకుల కృషిని అభినందించారు.
