డేటా సెంటర్ల హబ్‌గా తెలంగాణ.. ష్నైడర్‌కు భట్టి ఆహ్వానం ‎

డేటా సెంటర్ల హబ్‌గా తెలంగాణ.. ష్నైడర్‌కు భట్టి ఆహ్వానం

‎హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 22 :  ‎ప్రపంచ స్థాయి ఎనర్జీ టెక్నాలజీ సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆహ్వానించారు. డేటా సెంటర్ల అభివృద్ధికి తెలంగాణ ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న నేపథ్యంలో విద్యుదీకరణ, డిజిటలైజేషన్, ఆటోమేషన్ రంగాల్లో సంస్థకు భారీ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా రాష్ట్రంలో తయారీ సామర్థ్యాలను విస్తరించుకోవాలని సూచించారు.

‎

‎పారిస్‌లోని ష్నైడర్ ఎలక్ట్రిక్ కార్యాలయాన్ని సందర్శించిన భట్టి విక్రమార్క సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు గ్వెనెల్ హుయెట్, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ సునీల్ కుమార్ సింగ్, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో డేటా సెంటర్ల రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న తీరును వివరించారు. భవిష్యత్తులో సంస్థ మొత్తం ఆదాయంలో 30 శాతానికి పైగా డేటా సెంటర్ల వ్యాపారం నుంచే వచ్చే అవకాశాలున్నాయని, ఈ నేపథ్యంలో తెలంగాణలో తయారీ కేంద్రాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇదే సరైన సమయమని సూచించారు.

‎

‎

‎ష్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థకు భారత కార్యకలాపాల్లో తెలంగాణ ప్రత్యేకమైన, వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగి ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలో సంస్థకు చెందిన తయారీ, పరిశోధన-అభివృద్ధి, విక్రయాలు తదితర విభాగాల్లో ఇప్పటికే 5 వేల మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. సంస్థకు చెందిన తెలంగాణ యూనిట్ ప్రపంచవ్యాప్తంగా ఆదర్శవంతమైన యూనిట్‌గా (లైట్‌హౌస్) గుర్తింపు పొందడం రాష్ట్ర పారిశ్రామిక రంగానికి గర్వకారణమని అన్నారు.

‎

‎ఈ నెల 30న సంస్థ నూతన సదుపాయం ప్రారంభం కానున్న నేపథ్యంలో ష్నైడర్ ఎలక్ట్రిక్ ప్రతినిధులకు ముందస్తు అభినందనలు తెలిపారు. పారిస్ కార్యాలయంలో తమకు ఆత్మీయ స్వాగతం పలికినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ శర్మ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ.. తెలంగాణతో సంస్థ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన నిరంతర కృషి కీలకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.

‎

‎అత్యాధునిక సాంకేతికతలకు విస్తృత అవకాశాలు

‎

‎సమావేశంలో సంస్థ అంతర్జాతీయ స్థాయి సామర్థ్యాలు, భారత్‌లో విస్తరించిన కార్యకలాపాలు, తెలంగాణతో పెరుగుతున్న భాగస్వామ్యంపై చర్చించారు. అత్యాధునిక ఎనర్జీ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ఆధారిత ఆటోమేషన్ పరిష్కారాల వినియోగంపై ఇరుపక్షాలు అభిప్రాయాలు పంచుకున్నాయి. విద్యుదీకరణ, ఆటోమేషన్, డిజిటల్ సాంకేతికతల సమన్వయంతో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతంగా, పటిష్టంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దవచ్చని పేర్కొన్నారు.

‎

‎తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న పారిశ్రామిక రంగం, డేటా సెంటర్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ష్నైడర్ ఎలక్ట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఎంతగానో దోహదపడుతుందని రాష్ట్ర ప్రతినిధి బృందం అభిప్రాయపడింది. పారిస్‌లో సంస్థ ఉన్నతస్థాయి ప్రతినిధులతో జరిగిన ఈ సమావేశం తెలంగాణతో సంస్థ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞాన విస్తరణకు కొత్త అవకాశాలను తెరిచిందని ఉప ముఖ్యమంత్రి వెంట ఉన్న సీనియర్ అధికారి తెలిపారు. తెలంగాణలో సంస్థ నిరంతర వృద్ధి, విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.