వేజ్‌ సీకర్ల సంఖ్య మరింత పెంచాలని మంత్రి సీతక్క ఆదేశం

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 07 :

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు నిరంతర ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ పనులు తగ్గుతున్న పరిస్థితుల్లో గ్రామీణ కూలీలకు ప్రత్యామ్నాయంగా ఉపాధి హామీ పనులను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. అక్టోబర్‌ నెలలో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగింది. మంగ‌ళ‌వారం నాడు ఒక్కరోజే 2,54,812 మంది కూలీలు పనులకు హాజరయ్యారు. వీబీ–జీ రామ్‌ జీ అమలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రంలో నమోదైన అత్యధిక రోజువారీ కూలీల హాజరు ఇదే. గత ఐదేళ్ల అక్టోబర్‌ నెలలో రోజువారీ సగటు వేజ్‌ సీకర్ల సంఖ్యను పరిశీలిస్తే ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. 2025 అక్టోబర్‌లో రోజుకు సగటున కేవలం 24,750 మంది ఉపాధి హామీ పనులకు హాజరవగా, 2026 అక్టోబర్‌లో ఈ సంఖ్య 2.16 లక్షలకు చేరింది.అంటే గ‌త ఏడాదితో పోలిస్తే రోజువారీ సగటు వేజ్‌ సీకర్ల సంఖ్య ఘ‌న‌నీయంగా పెరిగింది. ఎల్ ని నో కార‌ణంగా వ్యవసాయ పనులు తగ్గుతున్న సమయంలో గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భద్రత కల్పించేందుకు ఉపాధి హామీ పనులను విస్తృతం చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించడంతో పాటు జిల్లా అధికారుల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. గ్రామాల్లో పని కోరుతున్న ప్రతి కుటుంబానికి వీలైనంత త్వరగా పని కల్పించాలని, వేజ్‌ సీకర్ల సంఖ్యను మరింత పెంచేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. కొత్తగా ఉపాధి హామీ కార్డులు కోరుతున్న వారికి 15 రోజుల్లోగా జాబ్‌ కార్డులు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పని కోరే కూలీలను గుర్తించి, వారికి అందుబాటులో ఉన్న పనుల వివరాలను తెలియజేసి, ఎక్కువ సంఖ్యలో కూలీలు పనుల్లో పాల్గొనేలా చూడాలని స్పష్టం చేశారు. మంత్రి సీత‌క్క ఆదేశాల‌తో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల పురోగతిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. కూలీలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలను తెలుసుకోవడంతో పాటు, పని కోరుతున్న వారికి వెంటనే ఉపాధి కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్న కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతూ..మంగ‌ళ‌వారం నాడు రికార్డు ను నెల‌కొల్పింది.

Leave A Reply

Your email address will not be published.