చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 15 : నాంపల్లిలోని చేనేత భవన్‌లో తెలంగాణ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ నూతన కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి మరింత కృషి చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ అవకాశాలు కల్పించి, చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. తెలంగాణ చేనేత వస్త్రాలకు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. చేనేత రంగంపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, చేనేత వస్త్రాల వినియోగాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. దేవాలయాలు, అధికారిక కార్యక్రమాలు, ఉపాధ్యాయులు, ప్రముఖుల సన్మానాల్లో సాధారణ సిల్క్ శాలువాలకు బదులుగా చేనేత శాలువాలను వినియోగించాలని మంత్రి సూచించారు. రాజకీయ నాయకులు పరస్పరం గౌరవించుకునే కార్యక్రమాల్లోనూ చేనేత శాలువాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేయాలని పేర్కొన్నారు. ముడిసరుకు సేకరణ నుంచి వస్త్రాల తయారీ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు చేనేత రంగంలోని ప్రతి వర్గానికీ ప్రయోజనం కలిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తెలిపారు. చేనేత కార్మికులు తయారు చేసిన ఉత్పత్తులకు సరైన మార్కెట్ కల్పించి, వారి శ్రమకు తగిన ప్రతిఫలం అందేలా చూడాలన్నారు. చేనేత రంగ అభివృద్ధి ద్వారా కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, సమాజంలో గౌరవప్రదమైన జీవనం సాగించే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచి రాజకీయ జీవితంలో కష్టపడి పనిచేస్తూ ముందుకు సాగిన స్ఫూర్తితో నూతన చైర్మన్ చేనేత రంగ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. చేనేత కార్మికుల సంక్షేమం, ఉత్పత్తుల మార్కెటింగ్, తెలంగాణ చేనేతకు విస్తృత గుర్తింపు కల్పించే దిశగా సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.