కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీళ్లు.. రైతులకు కరువు : చామల 

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీళ్లు.. రైతులకు కరువు : చామల

 

హైదరాబాద్‌, వెలుతురు అక్టోబర్‌ 17

 

తెలంగాణలో నీటి సమస్యకు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే కారణమని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. గాంధీభవన్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్‌ హయాంలో తెలంగాణకు నీళ్లు అందించకుండా ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు నీటిని తరలించుకునేలా ప్రణాళికలు రూపొందించారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లడానికి కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, నీటి దోపిడీ కారణమన్నారు.

 

కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్న మూడు ఎకరాల బావి నుంచి రైతులకు నీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చామల తెలిపారు. మార్కుక్‌ మండలం ఎర్రవల్లిలో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ సమీపంలో 58 ఎకరాల చెరువు ఉందని, 2016కు ముందు అక్కడ అలాంటి చెరువు లేదని పేర్కొన్నారు. కొండపోచమ్మ నుంచి జగదేవ్‌పూర్‌ కెనాల్‌కు, అక్కడి నుంచి పాండురంగ చెరువుకు నీరు చేరి, అక్కడి నుంచి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీరు తరలించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేశారని ఆరోపించారు.

 

జీవో నంబర్‌ 49 ద్వారా సుమారు రూ.42.52 కోట్ల విలువైన డ్రిప్‌ వ్యవస్థను మెటాఫిమ్‌ కంపెనీ ద్వారా సబ్సిడీపై తీసుకున్నారని చామల ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు నీళ్లు అందించాలన్న ఆలోచన కంటే ఫామ్‌హౌస్‌కు నీటిని తీసుకురావడంపైనే కేసీఆర్‌ దృష్టి పెట్టారని విమర్శించారు.

 

కాళేశ్వరంతో కోటి ఎకరాలంటూ భ్రమ

 

కేసీఆర్‌ ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో కోటి ఎకరాలకు నీరు అందుతోందనే భావనలో ఉన్నారని చామల ఎద్దేవా చేశారు. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని ఆరోపిస్తూ.. సింగరేణి సంస్థపై రూ.30 వేల కోట్ల అప్పుల భారం ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపై ఉందన్నారు.

 

ఎల్‌నినోపై ప్రజలను అప్రమత్తం చేస్తున్న సీఎం

 

ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో తెలంగాణలోనూ వర్షాభావ పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని చామల తెలిపారు. ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు మాత్రం ఆ ప్రభావం లేదన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు.

 

తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలు గుర్తుకు వస్తాయని, గత పాలనలో నీళ్లు కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు, నియామకాలు అమెరికాలో ఉన్న కేటీఆర్‌కు మంత్రి పదవి రూపంలో, నిధులు వారి కుటుంబానికే వెళ్లాయని చామల తీవ్ర విమర్శలు చేశారు.

 

అప్పుల రాష్ట్రానికి రేవంత్‌ సీఎం

 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మిగులు రాష్ట్రానికి సీఎం కాలేదని, అప్పుల రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారని చామల అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని ఆరోపించారు. ప్రజలకు నీరు, నిధులు, నియామకాల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.