అధికారుల తీరుపై మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం

అధికారుల తీరుపై మధుయాష్కీ గౌడ్ ఆగ్రహం.

 

హైదరాబాద్‌, వెలుతురు, అక్టోబర్ 17 : : అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఏకంగా ఒక మంత్రి చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కీ గౌడ్ ప్రశ్నించారు. గాంధీభవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారులు తప్పుదోవ పట్టించడం ఏమిటని నిలదీశారు. ప్రభుత్వంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించిన కొందరు అధికారులు ఇప్పటికీ అదే ధోరణిలో వ్యవహరిస్తూ మంత్రులను తప్పుదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

ముఖ్యమంత్రి బొగ్గు కొరతపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని మధుయాష్కీ ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం సక్రమంగా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి అంశాలపై ముఖ్యమంత్రి స్థాయిలో ప్రత్యేకంగా సమీక్ష చేయాల్సిన అవసరం ఎందుకు వస్తోందని అన్నారు. అధికారులు వాస్తవ పరిస్థితులను ప్రభుత్వ పెద్దలకు ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు.

 

ప్రభుత్వం బాగా పనిచేస్తోందని, ముఖ్యమంత్రి పనితీరు కూడా బాగుందని పలువురు చెబుతున్నప్పటికీ.. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో మాత్రం లోపం ఉందని మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వం సాధిస్తున్న ఫలితాలను సమర్థంగా ప్రచారం చేసుకోలేకపోతున్నామని అన్నారు.

 

పూర్తిగా అధికారులపైనే ఆధారపడటం వల్ల ప్రభుత్వానికి నష్టం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి రాజకీయ నాయకత్వం స్వయంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా మరింత సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మధుయాష్కీ గౌడ్ సూచించారు.

 

ప్రభుత్వానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు, ప్రజల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి సమస్యలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి, మంత్రుల దృష్టికి చేరేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన కోరారు.

Leave A Reply

Your email address will not be published.