తాగునీటి సమస్యలు రాకుండా చర్యలపై మంత్రి సీతక్క సమీక్ష

తాగునీటి సమస్యలు రాకుండా చర్యలపై మంత్రి సీతక్క సమీక్ష

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 17:  ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా రాష్ట్రంలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు కార్యాచరణ ప్రణాళికను పకడ్బందీగా అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా సంక్షేమ శాఖల మంత్రి డా. దనిసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. తాగునీటి అవసరాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు.

 

ఎర్రమంజిల్‌లోని గ్రామీణ తాగునీటి సరఫరా కార్యాలయంలో శని వారం మంత్రి సీతక్క ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీటి సరఫరాపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రిజర్వాయర్ల వారీగా నీటి నిల్వలు, ప్రస్తుత తాగునీటి సరఫరా పరిస్థితులు, రానున్న వేసవిలో ఎదురయ్యే అవసరాలు, వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్రంగా చర్చించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య దేవరాజన్, ENC కృపాకర్ రెడ్డి, వివిధ స్థాయిలకు చెందిన చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

 

తాగునీటికే మొదటి ప్రాధాన్యత

 

నవంబర్ 1వ తేదీలోపు సాగునీటి అవసరాలు తీరిన అనంతరం రిజర్వాయర్లలో అందుబాటులో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీ స్థాయికి చేరినా సరఫరాకు ఆటంకం కలగకుండా అత్యవసర పంపులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అవసరమైన పంపులను సమీకరించి కనీసం 100 పంపులను అందుబాటులో ఉంచాలని, పనిచేయని పంపులకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.

 

గ్రామస్థాయి నుంచే వేసవి కార్యాచరణ

 

రానున్న యాసంగి సీజన్‌లో ఆరుతడి పంటలకు ప్రాధాన్యతనిచ్చేలా రైతులకు గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి సూచించారు. నవంబర్ మొదటి వారంలో జిల్లా కలెక్టర్లతో కలిసి గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు సమీక్షలు నిర్వహించి వేసవి కార్యాచరణను వేగవంతం చేయాలన్నారు. రెండో వారంలో మండల స్థాయిలో తాగునీటి అవసరాలపై అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 

ప్రతి గ్రామం, ప్రతి ఆవాస ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని హ్యాబిటేషన్‌ల వారీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని, స్థానికంగా అందుబాటులో ఉన్న తాగునీటి వనరులను ముందుగానే గుర్తించి వినియోగానికి సిద్ధం చేయాలని చెప్పారు. భూగర్భ జలాలను పెంపొందించేందుకు బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాల పనులను పూర్తి చేయాలని, అవసరమైన చోట చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

 

పైప్‌లైన్ లీకేజీలపై నిర్లక్ష్యం వద్దు

 

అందుబాటులో ఉన్న నీటిని ప్రతి చుక్కా విలువైనదిగా భావించి పొదుపుగా వినియోగించుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. తాగునీటి పైప్‌లైన్లలో లీకేజీలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని, ఇతర శాఖలు రోడ్డు మరమ్మతులు, నిర్మాణ పనులు చేపట్టే సమయంలో తాగునీటి పైప్‌లైన్లు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

నిర్మాణ పనుల కారణంగా పైప్‌లైన్లు దెబ్బతింటే సంబంధిత శాఖలే బాధ్యత వహించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పైప్‌లైన్లు దెబ్బతిన్న సందర్భాల్లో వెంటనే మరమ్మతులు పూర్తి చేసి నీటి సరఫరాను పునరుద్ధరించాలని స్పష్టం చేశారు. ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్వహణ, పైప్‌లైన్ మరమ్మతులకు అవసరమైన నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఇందుకోసం నిబంధనల మేరకు VB-G RAM G నిధులను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

 

అత్యవసర నిధులతో తక్షణ చర్యలు

 

తాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాల్లో ఆలస్యం లేకుండా చర్యలు చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉన్న అత్యవసర నిధులతో పాటు SDF నిధులను కూడా నిబంధనల ప్రకారం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. ఎక్కడైనా తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే స్పందించేలా కంటింజెన్సీ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

 

సింగూరు ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక సమీక్ష

 

సింగూరు రిజర్వాయర్ మినహా ఇతర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన నీటి నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. సింగూరు రిజర్వాయర్‌పై ఆధారపడిన జిల్లాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ నెల 23న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

 

ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ముందస్తు ప్రణాళికలు, నీటి వనరుల సమర్థ వినియోగం, నిరంతర పర్యవేక్షణతో రానున్న వేసవిలోనూ ప్రజలకు మంచినీటి సమస్యలు రాకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.