రష్యా ఆయిల్ కొనుగోళ్లపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్, వెలుతురు, అక్టోబర్ 18 : భారత్ అమెరికాకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని, ఇంధన అవసరాల కోసం రష్యాపై ఆధారపడటాన్ని ఒక్క రోజులో మార్చుకోవడం కష్టమని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వ్యాఖ్యానించారు. రష్యా నుంచి భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్కు అమెరికా తాత్కాలిక ఊరట కల్పిస్తూ అమెరికా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రుబియో ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాపై విధించిన ఆంక్షల చట్టం నుంచి భారత్ సహా కొన్ని దేశాలకు 60 రోజుల పాటు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం ‘లిండ్సే ఓ గ్రాహం శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్’ కింద ఈ వెయివర్పై సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం, రష్యా నుంచి అధిక మొత్తంలో చమురు, గ్యాస్ కొనుగోలు చేసే టాప్ 5 దేశాల (భారత్, చైనా సహా) నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 100 శాతం వరకు టారిఫ్లు విధించే అధికారం ఉంది. అయితే, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ట్రంప్ ఈ నిబంధనలను తాత్కాలికంగా నిలిపివేశారు.
శనివారం వాషింగ్టన్లో విలేకరులతో మాట్లాడిన మార్కో రుబియో, ఈ నిర్ణయం వెనుక గల కారణాలను వివరించారు. “ఈ ఆంక్షలు కేవలం రష్యాపైనే కాదు. భారత్ వంటి ఇతర దేశాలపైనా టారిఫ్ల రూపంలో ప్రభావం చూపుతాయి. అందుకే అధ్యక్షుడు 60 రోజుల సమయం తీసుకుని, ప్రపంచ, అమెరికా ఆర్థిక వ్యవస్థలపై పడే ప్రభావాన్ని అధ్యయనం చేయాలని భావిస్తున్నారు” అని తెలిపారు. భారత్ ఇంధన వనరులను వైవిధ్యపరుచుకుంటున్నప్పటికీ, రష్యా నుంచి ఇంకా గణనీయమైన మొత్తంలో ఇంధనాన్ని కొనుగోలు చేస్తోందని, ఇది ఒక్కరోజులో మారే ప్రక్రియ కాదని ఆయన స్పష్టం చేశారు.
