ట్రంప్ ఇంటికి సమీపంలో కూలిన విమానం

ట్రంప్ ఇంటికి సమీపంలో కూలిన విమానం

 

ఫ్లోరిడా, వెలుతురు, నవంబర్ 02 : అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌ కౌంటీలో ఓ ప్రైవేట్‌ జెట్‌ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల కారణాలపై ఏవియేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిపివేసి, సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చెందిన మార్‌-ఎ-లాగో నివాసానికి సుమారు తొమ్మిది మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

 

అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. టెక్సాస్‌లోని ఆస్టిన్-బెర్గ్‌స్ట్రోమ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బహామాస్‌కు వెళ్తున్న లియర్‌జెట్‌ 60 విమానం ఒక్కసారిగా అదుపుతప్పి జనావాసాల మధ్య కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.50 గంటల సమయంలో ఆకాశం నుంచి నిలువునా కిందకు దూసుకొచ్చిన విమానం మిలిటరీ ట్రైల్, టెన్త్ అవెన్యూ నార్త్ ప్రాంతంలో ఉండే రోడ్డుపై పడి పేలిపోయింది. నేలను బలంగా ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. భారీ పేలుడుకు గురైంది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. విమానం శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దట్టమైన నల్లటి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. కార్లలో ప్రయాణిస్తున్న కొందరు తమ డ్యాష్‌క్యామ్‌లలో ప్రమాద దృశ్యాలను చిత్రీకరించారు. అందులో విమానం ఒక్కసారిగా కిందకు వేగంగా దూసుకొస్తున్నట్లు కనిపించింది.

Leave A Reply

Your email address will not be published.