12 వేల మంది సర్పంచులు, 12వేల మంది జీపీ కార్యదర్శులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్

12 వేల మంది సర్పంచులు, 12వేల మంది జీపీ కార్యదర్శులతో మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్

 

హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 28: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయడంతోపాటు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామీణ ప్రజలకు భరోసా కల్పించాలని పిలుపునిచ్చారు.

 

బీఆర్‌కే భవన్‌లోని సెర్ప్ కార్యాలయం నుంచి బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సీతక్క రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులతో మాట్లాడారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, సెర్ప్ కమిషనర్ దివ్య దేవరాజన్, జిల్లా అదనపు కలెక్టర్లు ఐటిడిఓ అధికారులు, డిఆర్డిఓ లు, డిపిఓ లు, జడ్పి సీఈఓ లు, ఇంజనీరింగ్ విభాగపు అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రూపొందించిన ‘జలసిరి’ వీడియోను మంత్రి ఆవిష్కరించారు.

 

ప్రతి గ్రామంలో ఉపాధి పనులు

 

రాష్ట్రంలోని 12,516 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన 244 గ్రామ పంచాయతీల్లోనూ వెంటనే పనులు ప్రారంభించాలని మంత్రి ఆదేశించారు. అక్టోబర్ 27న ఉపాధి పనులకు 3,97,788 మంది కూలీలు హాజరుకావడం రికార్డుగా నిలిచిందని, ఈ సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు. గ్రామాల్లో కూలీలను సమీకరించి వారికి నిరంతరంగా పనులు కల్పించాలని సూచించారు.

 

ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించాలని, పనుల నిర్వహణలో సమర్థవంతమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతూనే, కూలీలకు స్థానికంగా ఉపాధి కల్పించి వలసలను నివారించాలని చెప్పారు.

 

నీటి సంరక్షణకు పెద్దపీట

 

ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఫామ్ పాండ్లు, ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీచార్జ్ పనులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని మంత్రి సూచించారు. చెరువుల పునరుద్ధరణతోపాటు వర్షపు నీటిని ఒడిసిపట్టే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పశువులకు మేత, తాగునీటి కొరత రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో నీటి వృథాను అరికట్టేందుకు సర్పంచులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చనే విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించాలని తెలిపారు.

 

అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు

 

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అవసరమైన నిధులు అందుబాటులో ఉంచుతోందని మంత్రి సీతక్క తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా వచ్చే నిధులను సద్వినియోగం చేసుకొని వర్క్‌షెడ్లు, పశువుల షెడ్లు, కమ్యూనిటీ హాళ్లు వంటి నిర్మాణాలు చేపట్టవచ్చని చెప్పారు. ఒక్కో గ్రామానికి సుమారు రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు నిధులు సమకూరే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పనుల బిల్లులు 15 రోజుల్లో వస్తాయని పేర్కొంటూ, ఆ నిధులను గ్రామాభివృద్ధికి ఉపయోగించుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సర్పంచులు, కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు పనిచేయాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల విషయంలో అలసత్వం వహించే సర్పంచులకు అధికారులకు నోటీసులు ఇస్తామని హెచ్చరించారు.

 

సర్పంచుల అభిప్రాయాల సేకరణ

 

వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పలు జిల్లాలకు చెందిన సర్పంచులతో మంత్రి నేరుగా మాట్లాడి, వారి గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులను సమర్థవంతంగా వినియోగించుకొని గ్రామాల్లో అభివృద్ధిని సాధించిన సర్పంచులను అభినందించారు. వారి పనితీరును ఆదర్శంగా తీసుకొని ఇతర సర్పంచులు కూడా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.

 

గ్రామాల అభివృద్ధి పనుల వివరాలను జీపీఎస్‌ఏపీ (GPSAP)లో నమోదు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో కోటి 12 లక్షల రికార్డులను నమోదు చేశామని, ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందులో పొందుపరిచామని వెల్లడించారు. ఈ వ్యవస్థను ఉపయోగించుకొని పనుల ప్రణాళిక, అమలు, పర్యవేక్షణను మెరుగుపర్చాలని సూచించారు.

 

ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

 

ఏజెన్సీ ప్రాంతాల్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కూలీలకు ఉపాధి కల్పించాలని మంత్రి ఆదేశించారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, ప్రజల జీవన విధానాలను దృష్టిలో పెట్టుకొని పనులను ఎంపిక చేయాలని తెలిపారు. నీటి సంరక్షణ పనులు, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం చేపట్టడంతోపాటు స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచి వలసలను అరికట్టాలని సూచించారు.

 

నవంబర్ 19లోగా మహిళా సంఘ భవనాలు పూర్తి చేయాలి

 

 

ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న గ్రామ మహిళా సంఘ భవనాలను ప్రారంభించుకునేలా నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు.

 

ఆదర్శ గ్రామాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు

 

గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు పొందే అవకాశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. అవార్డుల ద్వారా లభించే అదనపు నిధులను కూడా గ్రామాల అభివృద్ధికి వినియోగించుకోవచ్చని తెలిపారు. ప్రతి గ్రామంలో మౌలిక వసతులు, నీటి సంరక్షణ, ఉపాధి కల్పన, పారిశుద్ధ్యం వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా తిరిగి నియమితులైన దాన కిషోర్‌ను మంత్రి సీతక్క అభినందించి సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.