ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక

ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక

 

హైదరాబాద్‌, వెలుతురు, అక్టోబర్ 30 :  దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని ప్రతి గ్రామపంచాయతీకి సమగ్ర అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క ఆలోచన, ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (GPSAP-2026)ను రూపొందించారు. ఇందులో గ్రామ జనాభా, కుటుంబాల స్థితిగతులు, ఉపాధి, గృహవసతి, పశుసంపద, ప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలతో గ్రామ సమగ్ర ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తారు. గ్రామ అవసరాలు, ప్రాధాన్యతల ఆధారంగా వచ్చే మూడు నుంచి ఐదేళ్ల అభివృద్ధి పనులకు కార్యాచరణ రూపొందించడంతో పాటు ప్రస్తుత సంవత్సరానికి ప్రత్యేక వార్షిక ప్రణాళికను అమలు చేయనున్నారు.

 

వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ప్రతి గ్రామపంచాయతీకి ప్రత్యేక వెబ్‌సైట్‌, పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు డాష్‌బోర్డు ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి నెలా గ్రామపంచాయతీ సమావేశంలో GPSAPపై సమీక్ష నిర్వహించనున్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు అధికారులకు బాధ్యతలు అప్పగించడంతో పాటు సమాచారం ఇవ్వని లేదా తప్పుడు సమాచారం అందించే వారిపై చర్యలు తీసుకోనున్నారు.

 

తెలంగాణ రైజింగ్‌–2047 లక్ష్యాలకు అనుగుణంగా పారదర్శకత, జవాబుదారీతనంతో గ్రామాల అభివృద్ధికి ప్రణాళికాబద్ధమైన పాలన అందించడమే GPSAP లక్ష్యమని పంచాయతీరాజ్‌ శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.