రైతును రారాజు చేయడమే మోదీ లక్ష్యం: బండి సంజయ్
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 30 : హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన పీఎం కిసాన్ సమ్మాన్ నిధి విడుదల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. దేశానికి జై జవాన్, జై కిసాన్ రెండు కళ్లు అని పేర్కొన్న ఆయన.. రైతు, సైనికులపై ప్రధాని మోదీకి ప్రత్యేక అభిమానం ఉందన్నారు.
2014తో పోలిస్తే వ్యవసాయ బడ్జెట్ను ఐదు రెట్లు పెంచామని, రైతులను రారాజులుగా చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ఇప్పటివరకు 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని, తాజాగా 9.34 కోట్ల మంది రైతులకు రూ.18,690 కోట్లు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో 30 లక్షల మందికి పైగా రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు.
ఎరువుల సబ్సిడీ కోసం కేంద్రం రూ.12 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, కిసాన్ క్రెడిట్ కార్డులు, సాయిల్ హెల్త్ కార్డుల ద్వారా రైతులకు కేంద్రం అండగా నిలుస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం, శాస్త్రవేత్తల కృషితో భారత్ వరి ఎగుమతుల్లో ప్రపంచంలో అగ్రస్థానానికి చేరిందని తెలిపారు.
ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో 11 లక్షల ఎకరాల్లో పంట సాగు కాలేదని, సుమారు రూ.20 వేల కోట్ల పంట నష్టం జరిగిందని అంచనా ఉందన్నారు. రాష్ట్రంలోని మరిన్ని మండలాలను కరువు జాబితాలో చేర్చాలని కోరారు. రైతులను ఆదుకునేలా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలను అభివృద్ధి చేయాలని సూచించారు.
వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించాలంటే రైతులను భాగస్వాములుగా చేయాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ అన్నారు. రైతు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ప్రభుత్వం కలిసికట్టుగా పనిచేస్తే భారత వ్యవసాయాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకెళ్లగలమని పేర్కొన్నారు.
