మేడిగడ్డ నీటిని వినియోగించి రైతులను ఆదుకోవాలి: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 30 : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తెలంగాణలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కె. సంజయ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. మేడిగడ్డ వద్ద అందుబాటులో ఉన్న గోదావరి జలాలను ఎత్తిపోసి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. నీటిని వినియోగించకుండా వృథాగా వదిలేయడం ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. ఎండిపోయిన ప్రతి ఎకరాకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయానికి, విద్యుత్ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారని, ప్రస్తుత ప్రభుత్వం రైతులకు నీరు, పరిశ్రమలకు విద్యుత్ అందించడంలో విఫలమైందని విమర్శించారు. గ్లోబల్ సమ్మిట్లపై దృష్టి పెట్టే బదులు ప్రజల తాగునీటి సమస్యలు, రైతుల సాగునీటి కష్టాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమళ్ల రాకేష్ కుమార్ పాల్గొన్నారు.
