అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : పొన్నం
హైదరాబాద్, వెలుతురు, అక్టోబర్ 30 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, అమరవీరులపై గతంలో చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడుతూ.. వేలాది కోట్ల విలువైన తెలంగాణ భూములు అన్యాక్రాంతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన న్యాయపోరాటంలో విజయం సాధించడం అభినందనీయమన్నారు.
ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో నిర్వహించే ‘ఓట్ చోర్ గద్దీ చోర్’ నిరసనలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. తెలంగాణకు బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీల జనాభా ఎంత ఉందో లెక్క తేల్చాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రశాంతంగా ఉన్న తెలంగాణకు రావడం కంటే ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలపై కేంద్ర హోంమంత్రి దృష్టి సారించాలని పొన్నం సూచించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలు, ఇతర అవకతవకలపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
