ములుగు వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు
ములుగు, వెలుతురు, నవంబర్ 03 : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్ సిబ్బంది ములుగు వంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క అన్నారు. వైద్య సేవల విస్తరణకు చొరవ తీసుకున్న ఎయిమ్స్ బీబీనగర్ బృందానికి ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం ఎయిమ్స్ బీబీనగర్‌ను సందర్శించిన మంత్రి, ములుగు జిల్లాలో వైద్య సేవల కల్పన, ఆసుపత్రుల నిర్మాణంపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
మతం, ప్రాంతం, కులం, తెగతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందడం హక్కు అని సీతక్క పేర్కొన్నారు. మారుమూల అటవీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత కారణంగా ఆదివాసి గిరిజనులకు ఆధునిక వైద్యం సకాలంలో అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సేవలందించడం అత్యంత గొప్ప సేవ అని, ఎయిమ్స్ వైద్యులు కొంతకాలమైనా ములుగు వంటి ప్రాంతాల్లో పనిచేసి ప్రజలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
ఎయిమ్స్ బీబీనగర్, సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం సంయుక్తంగా ములుగు జిల్లాలో గిరిజన ఆరోగ్య పరిరక్షణ, వైద్య శిక్షణ కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమన్నారు. స్థానిక ఆదివాసీ యువతకు శిక్షణ ఇచ్చి, వారి ప్రాంతాల్లోనే ఆరోగ్య కార్యకర్తలుగా సేవలందించే అవకాశం కల్పించడం ద్వారా ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువవుతాయని చెప్పారు.
ములుగు, ఏటూరునాగారంలో తొలిదశలో శాటిలైట్ హెల్త్ సెంటర్లను ప్రారంభించాలని, టెలీమెడిసిన్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ఎయిమ్స్ బృందాన్ని కోరారు. గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, రక్తహీనత, పోషకాహార లోపం, సికిల్ సెల్ వ్యాధి, మలేరియా వంటి సమస్యల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆదివాసి గిరిజన గ్రామాల్లో వైద్య సేవలు అందించే సమయంలో స్థానిక భాషలు, సంప్రదాయాలు, జీవన విధానాలను గౌరవించాలని వైద్యులకు సూచించారు. కోయ, గోండి, లంబాడీ భాషల్లో ఆరోగ్య అవగాహన కల్పించడం ప్రయోజనకరమన్నారు.
ములుగు జిల్లా ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఏయిమ్స్‌తో కలిసి పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ, గ్రామీణ నీటి సరఫరా శాఖలు సమన్వయంతో పనిచేస్తాయని తెలిపారు. ములుగు జిల్లా ఆరోగ్య సంరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఎయిమ్స్ బీబీనగర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమితా అగర్వాల్, సమ్మక్క సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై.ఎల్. శ్రీనివాస్, రీసెర్చ్ డీన్ డాక్టర్ రాహుల్ నారాక్, వివిధ విభాగాల డీన్లు, వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు.
