నిర్మల్ గడ్డ కాషాయ అడ్డా : బండి సంజయ్
నిర్మల్, వెలుతురు, నవంబర్ 03: తెలంగాణ గడ్డపై ఇకపై కాషాయ జెండానే ఎగురుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. నిర్మల్‌లో నిర్వహించిన మహా పాదయాత్రకు హాజరైన ఆయన కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో ప్రధాని, ఎంపీలు, ఎమ్మెల్యేలను నిర్ణయించేది భారత పౌరులేనని, ఇతర దేశాల జోక్యాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ హయాంలోనూ ఓటర్ల జాబితా సవరణలు జరిగాయని, ఇప్పుడు రాహుల్ గాంధీ వాటిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ రాక్షస సేనలా వ్యవహరిస్తోందని, ప్రధాని మోదీ విమర్శలను గరళకంఠుడిలా భరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో విద్యుత్, నీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, పింఛన్లు అందక వృద్ధులు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. రామచంద్రరావు నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల అవినీతి, రాజకీయ విధానాలపై తీవ్ర విమర్శలు చేశారు.
