జీవో 14ను వెంటనే ఉపసంహరించుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

జీవో 14ను వెంటనే ఉపసంహరించుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

 

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 6

 

బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో 14ను వెంటనే ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అన్ని కుల సంఘాలు భాగస్వాములయ్యాయని, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు కేసీఆర్ హైదరాబాద్‌లో విలువైన స్థలాలను కేటాయించారని గుర్తుచేశారు. ఇప్పుడు జీవో 14 ద్వారా బీసీల హక్కులను, స్వయంప్రతిపత్తిని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, బీసీలకు ప్రత్యేక సబ్‌ప్లాన్, ఏటా రూ.20 కోట్ల బడ్జెట్ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జీవో 14పై రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

 

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ తదితరులు మాట్లాడుతూ జీవో 14ను రద్దు చేయాలని, అన్ని కుల సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.