భారత్ సమ్మిట్ దేశ వ్యతిరేకుల కలయిక వేదిక : బండి సంజయ్
హైదరాబాద్, నవంబర్ 13: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ దేశ అభివృద్ధిని అడ్డుకునే శక్తుల కలయిక వేదికగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. భారత్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేసేందుకు విదేశీ శక్తులతో కలిసి కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సమ్మిట్‌లో పాల్గొంటున్న 70 దేశాల ప్రతినిధుల్లో మెజారిటీ భారత విధానాలను వ్యతిరేకించేవారేనని వ్యాఖ్యానించారు. సమ్మిట్ నిర్వహణకు ఎంత ఖర్చు చేస్తున్నారు? గత సమావేశానికి ఖర్చు చేసిన రూ.29.45 కోట్ల ప్రజాధనం ఎవరికి, ఏయే రూపాల్లో చెల్లించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. గత సమ్మిట్‌లో ప్రకటించిన 44 అంశాల హైదరాబాద్ తీర్మానంలో ఎన్ని అమలయ్యాయి? ఎన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు వచ్చాయో చెప్పాలని కోరారు. గత సమ్మిట్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతులు కరువుతో ఇబ్బందులు పడుతుంటే, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, ఉద్యోగులు డీఏ, పీఆర్సీ కోసం నిరీక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలును పక్కనపెట్టి అంతర్జాతీయ సమావేశాల పేరుతో కాంగ్రెస్ రాజకీయ ప్రచారం చేసుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణకు అంతర్జాతీయ సమావేశాల ప్రచారం కంటే ఉద్యోగాలు, ఉపాధి, సాగునీరు, రైతులకు భరోసా ముఖ్యమని అన్నారు.
