నిమ్స్‌ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు

నిమ్స్‌ పేషెంట్లకు టిమ్స్‌లో సర్జరీలు

 

 

హైదరాబాద్‌, నవంబర్ 13: నిమ్స్‌ ఆసుపత్రిలో సర్జరీల కోసం ఎదురుచూస్తున్న పేషెంట్లకు సనత్‌నగర్‌లోని డాక్టర్‌ ఎంసీఆర్‌ టిమ్స్‌లో ఆపరేషన్లు నిర్వహించాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో నిమ్స్‌ వివిధ విభాగాల హెచ్‌వోడీలతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిమ్స్‌లో ఆపరేషన్‌ థియేటర్లు పరిమితంగా ఉండటంతో కొన్ని సర్జరీలకు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తోందని వైద్యులు మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి.. టిమ్స్‌లో అందుబాటులో ఉన్న అత్యాధునిక ఆపరేషన్‌ థియేటర్లు, వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. నిమ్స్‌ హెచ్‌వోడీలు వెంటనే టిమ్స్‌ను సందర్శించి సదుపాయాలను పరిశీలించాలని, అవసరమైన అదనపు పరికరాలను సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. టిమ్స్‌లో వైద్యుల నియామక ప్రక్రియను ప్రారంభించాలని, అప్పటివరకు నిమ్స్‌ వైద్యుల సహకారం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. రెండు ఆసుపత్రుల సమన్వయంతో పేషెంట్లకు సకాలంలో నాణ్యమైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు.