ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఏదీ? : హరీశ్‌రావు

ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఏదీ? : హరీశ్‌రావు

 

హైదరాబాద్, నవంబర్ 17

 

మేనిఫెస్టోకు మూడేళ్లు.. కాంగ్రెస్ నయవంచనకు మూడేళ్లని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని చెప్పిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చాక హామీల అమలును విస్మరించారని ఆరోపించారు. తొలి క్యాబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇప్పటివరకు 38 క్యాబినెట్ సమావేశాలు జరిగినా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంపై నిలదీశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటి అమలును గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఖర్గే, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మోసపూరిత వైఖరిని ప్రజలు గుర్తించారని, రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీశ్‌రావు పేర్కొన్నారు.