తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం: మంత్రి వాకిటి శ్రీహరి

తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా మారుద్దాం: మంత్రి వాకిటి శ్రీహరి

హైదరాబాద్, వెలుతురు, నవంబర్ 17 :  తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026 నిర్వహణ తెలంగాణ క్రీడా చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకబోతోందని పేర్కొన్నారు.

 

మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇన్వెస్ట్ తెలంగాణ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అంశాలపై ప్రముఖ క్రీడా ప్రముఖులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు) వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ వీసీ అండ్ ఎండీ సోనిబాలాదేవి, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రముఖ క్రీడాకారులు జె.జె. శోభ, నీతా ఎల్. దాడ్వే, ఇస్మాయిల్ బేగ్, ఈషా సింగ్, అంబటి తిరుపతి రాయుడు, అగసర నందిని, గగన్ నారంగ్, జ్వాలా గుత్తా, కల్నల్ నచ్ఛతర్ సింగ్ జోహల్, బోరియా మజుందార్, నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు.