ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం తప్పదు: మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌

 

హైదరాబాద్‌, వెలుతురు, నవంబర్ 17 :  ఎన్నికల ముందు 420 హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్ల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదలై మూడేళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, మహిళలకు తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు సహా అనేక హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అభయహస్తం భస్మాసుర హస్తంగా మారిందని, ప్రజల ఆశలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నీరుగార్చిందని మండిపడ్డారు. రాష్ట్రానికి సాగునీటి విషయంలోనూ అన్యాయం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై గ్రామగ్రామాన చర్చలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు.