ఇందిరమ్మ కృషిని గుర్తు చేస్తూ ఆదివాసీ కాంగ్రెస్ బస్ యాత్ర

  • గాంధీ భవన్‌లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం
  • ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

హైదరాబాద్ వెలుతురు జూన్ 15: గిరిజనులకు ఎస్టీ రిజర్వేషన్లు కల్పించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ చేసిన కృషిని ప్రజలకు చాటిచెప్పేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్ యాత్రను నిర్వహించనున్నట్లు టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్‌లో సోమవారం నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మకంగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

తాను పెరిగిన గ్రామంలో 85 శాతం మంది లంబాడీలు ఉండేవారని, వారి జీవన పరిస్థితులను చిన్నప్పటి నుంచే దగ్గరగా గమనించే అవకాశం తనకు లభించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. 1976లో లంబాడీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను స్వయంగా అధ్యయనం చేసిన ఇందిరా గాంధీ, వారి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టారని గుర్తు చేశారు.

గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడంలో ఇందిరా గాంధీ ఎప్పుడూ ముందుండేవారని, గిరిజనుల వెనుకబాటుతనాన్ని గుర్తించి వారికి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించడం ద్వారా వారి అభ్యున్నతికి బాటలు వేసిందని అన్నారు. నేడు గిరిజన సమాజం సామాజిక, విద్యా, రాజకీయ రంగాల్లో ఎదగడానికి ఇందిరా గాంధీ తీసుకున్న నిర్ణయాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమమని స్పష్టం చేసిన ఆయన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే సిద్ధాంతానికి కట్టుబడి రాష్ట్రంలో కుల గణన నిర్వహించారని తెలిపారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాలే కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలని, పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే విమర్శలు చేసే వారికి సరైన సమాధానమని అన్నారు.

గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి ఐదు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా చేపట్టనున్న బస్ యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఈ యాత్ర నిర్వహించి కాంగ్రెస్ పార్టీ గిరిజన సంక్షేమానికి చేసిన సేవలను ప్రజలకు వివరించనున్నట్లు సమావేశంలో వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.