జీవితం వంద మీటర్ల పరుగుపందెం కాదు: నితిన్‌ నబీన్‌

* జీవితం ఓపికకు పరీక్ష

* యువత ఆతృత తగ్గించుకోవాలి

* వేగం కంటే నిలకడ ముఖ్యం

* నిబద్ధతే విజయానికి బలం

* చిన్న వయసులోనే రాజకీయ ప్రవేశం

* సవాళ్లను అధిగమిస్తూ ముందుకు

* ప్రతి పనిలో ప్రత్యేకత ఉండాలి

* బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించాలి

* ఓపికతోనే విజయం సాధ్యం

* విద్యార్థులకు నితిన్‌ నబీన్‌ సూచనలు

హైదరాబాద్ వెలుతురు జూన్ 29:

జీవితం వంద మీటర్ల పరుగుపందెం కాదని, అది మన ఓపికకు పెట్టే పరీక్ష అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ అన్నారు. ఏ రంగంలోనైనా విజయాన్ని సాధించాలంటే వేగం కంటే ఓపిక, నిలకడ, నిబద్ధత ఎంతో ముఖ్యమని చెప్పారు. మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లోని వీబీఐటీ క్యాంపస్‌లో బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వికసిత్‌ భారత్‌ స్టూడెంట్స్‌ కాంక్లెవ్‌’లో ఆయన పాల్గొని విద్యార్థులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. రాజకీయ జీవితంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారని ఓ విద్యార్థి ప్రశ్నించగా, చిన్న వయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని నితిన్‌ నబీన్‌ తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో తన భవిష్యత్తుపై కొంత గందరగోళం ఏర్పడిందని, అయితే ప్రతి పనిలో తనదైన ముద్ర వేయాలనే లక్ష్యంతో ముందుకు సాగానని చెప్పారు.

తనకు పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో, చిత్తశుద్ధితో పూర్తి చేయడమే తన విజయానికి కారణమని పేర్కొన్నారు. నేటి యువత త్వరగా లక్ష్యాలను చేరుకోవాలనే ఆరాటంలో ఉంటోందని, కానీ జీవితంలో గొప్ప విజయాలు ఒక్కరోజులో రావని అన్నారు. ఏ పని చేసినా ఓపిక, క్రమశిక్షణ, నిలకడ, పూర్తి శక్తితో చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు.

విజయం కోసం షార్ట్‌కట్‌లను వెతకకుండా నిరంతరం శ్రమించాలన్నారు. అపజయాలు ఎదురైనా నిరాశ చెందకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. జీవితంలో సహనం, అంకితభావం, కష్టపడే తత్వం ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని నితిన్‌ నబీన్‌ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.