ఓటర్ల జాబితా సవరణలో నిర్లక్ష్యం వద్దు: మంత్రి పొన్నం ప్రభాకర్

 

రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కొనసాగుతోంది

బీఎల్‌వోలు ఇచ్చే ఎన్యూమరేషన్ ఫారం తప్పనిసరిగా నింపాలి

ఓటు గల్లంతు కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

జులై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల

బీఎల్‌ఏలు, బీఎల్‌వోలు అవగాహన కల్పించాలని సూచన

హుస్నాబాద్ వెలుతురు జూన్ 29:
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి అర్హుడూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ఇంటింటికీ అందజేస్తున్న ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి ఓటరు తప్పనిసరిగా నింపి అవసరమైన ఆధార పత్రాలతో సమర్పించాలని కోరారు. అలా చేస్తే ఓటు జాబితా నుంచి పేరు తొలగిపోయే అవకాశం ఉండదని తెలిపారు.

2002, 2025 ఓటరు జాబితాల పరిశీలనలో హుస్నాబాద్ నియోజకవర్గంలో సుమారు 60 వేల ఓట్లు తటస్థ స్థితిలో ఉన్నట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే తటస్థంగా ఉండటం అంటే ఓటు తొలగిపోయినట్లు కాదని స్పష్టం చేశారు.

ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సక్రమంగా నింపి, అవసరమైన ధ్రువీకరణ పత్రాలను సమర్పిస్తే ఓటు యథావిధిగా కొనసాగుతుందని వివరించారు. జులై 31న డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల కానున్న నేపథ్యంలో అప్పటి వరకు ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు, ఆయుధమని పేర్కొన్న మంత్రి, అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏలు), బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఓటర్ల సవరణ ప్రక్రియపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.