హైదరాబాద్ వెలుతురు జూన్ 30:
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.29,300 కోట్ల మేర బకాయి పడిందని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే టి. హరీశ్‌రావు ఆరోపించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు ఆశీర్వాద సభ వాస్తవానికి రైతు వంచన సభగా మారిందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సభల పేరుతో ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ప్రతి ఎకరానికి ఏడాదికి రూ.15 వేల పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కేవలం రూ.12 వేలే చెల్లించిందని హరీశ్‌రావు ఆరోపించారు. అందులోనూ ఒక పంట సీజన్‌కు సంబంధించిన రైతు భరోసాను పూర్తిగా ఎగ్గొట్టిందని విమర్శించారు.
మరో విడతలో రెండు ఎకరాల వరకు మాత్రమే రైతులకు పెట్టుబడి సాయం అందించిందని, అనంతరం మూడు ఎకరాల వరకు పరిమితం చేసి చెల్లింపులు జరిపిందని పేర్కొన్నారు. దీంతో పెద్ద సంఖ్యలో రైతులు ప్రభుత్వ హామీలకు దూరమయ్యారని, రైతాంగంలో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు.
రైతుబంధు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రూ.29,300 కోట్ల మేర రైతులకు బకాయి పడిందని హరీశ్‌రావు ఆరోపించారు. రైతులకు రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేసి ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని, లేకుంటే రైతులు తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని హెచ్చరించారు.
