కేంద్రం ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌.. గ్రామీణ ఉపాధికి కొత్త చట్టం అమలు పనిదినాలు 125కు పెంపు

నేటి నుంచి కొత్త ఉపాధి హామీ చట్టం అమల్లోకి

వంద రోజుల పనికి బదులు ఇక 125 రోజుల ఉపాధి

రోజువారీ కూలి రూ.300 నుంచి రూ.409 వరకు నిర్ణయం

సిక్కింలోని కొన్ని పంచాయతీలకు రూ.450 ప్రత్యేక వేతనం

21 రాష్ట్రాల్లో కనిష్ఠ కూలి రూ.300గా కేంద్రం నిర్ణయం

తెలంగాణలో రూ.308.. ఆంధ్రప్రదేశ్‌లో రూ.312 కూలి

దక్షిణ రాష్ట్రాల్లో వేతనాల పెంపు మూడు శాతం లోపే

కొన్ని ఉత్తర, ఈశాన్య రాష్ట్రాల్లో 15 శాతానికి పైగా పెంపు

కొత్త చట్టంతో వేతనాల సవరణకు కేంద్రం ఉత్తర్వులు

హైదరాబాద్ వెలుతురు జూలై 01:

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌–గ్రామీణ్‌ చట్టం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ కొత్త చట్టం ప్రకారం గ్రామీణ కార్మికులకు కల్పించే పనిదినాలను వంద రోజుల నుంచి 125 రోజులకు పెంచారు. అలాగే కొత్త చట్టం కింద చెల్లించే రోజువారీ కూలి రేట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది.

కొత్త నిబంధనల ప్రకారం రోజువారీ వేతనాన్ని కనిష్ఠంగా రూ.300, గరిష్ఠంగా రూ.409గా నిర్ణయించారు. సిక్కింలోని మూడు ప్రత్యేక పంచాయతీల్లో మాత్రం రోజుకు రూ.450 చొప్పున కూలి చెల్లించనున్నారు.

దేశంలోని 21 రాష్ట్రాల్లో రోజువారీ కూలి రూ.300గా నిర్ణయించారు. గుజరాత్‌, రాజస్థాన్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

తెలంగాణలో రోజువారీ కూలిని రూ.308గా, ఆంధ్రప్రదేశ్‌లో రూ.312గా నిర్ణయించారు. మహారాష్ట్రలో రూ.317, దాద్రా నగర్‌ హవేలీ, దమన్‌ దీవ్‌లలో రూ.340, తమిళనాడులో రూ.345, పుదుచ్చేరిలో రూ.347 చొప్పున చెల్లించనున్నారు. కర్ణాటకలో రూ.382, కేరళలో రూ.401, గోవాలో రూ.406 రోజువారీ కూలి అమల్లో ఉంటుంది.

వేతనాల పెంపులో రాష్ట్రాల మధ్య గణనీయమైన తేడా కనిపించింది. అరుణాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో గత ఉపాధి హామీ పథకంతో పోలిస్తే వేతనాలు 15 శాతానికి పైగా పెరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో పెంపు మూడు శాతం కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

2026–27 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం కింద వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించలేదు. కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకురావడమే లక్ష్యంగా వేతనాల ప్రకటనను వాయిదా వేసింది. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి రావడంతో తాజా వేతనాలను ప్రకటించింది. గతంలో చివరిసారిగా 2025 మార్చి 27న ఉపాధి కూలి రేట్లను కేంద్రం సవరించింది.

Leave A Reply

Your email address will not be published.