– తమిళనాట పొలిటికల్ హైడ్రామా
– విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర
– రూ.35 కోట్లు ఎర వేసిన డీఎంకే
– ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదు
– ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్
– తీవ్రస్థాయిలో మండిపడిన మంత్రి నిర్మల్
– ప్రభుత్వాన్ని కాపాడతామన్న కూటమి నేతలు
చెన్నై వెలుతురు జూలై 01:
తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రముఖ నటుడు విజయ్ నేతృత్వంలో కొద్దిరోజుల క్రితమే ఏర్పాటైన కొత్త ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని ప్రతిపక్ష డీఎంకే పార్టీ అడ్డదారుల్లో ప్రయత్నిస్తోందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి నిర్మల్ కుమార్ బుధవారం నాడు తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. అధికారంలోకి రాలేకపోయిన కసితో ఉన్న డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్, తమ కూటమికి చెందిన ఎమ్మెల్యేలను తీవ్ర ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి, దానిని గెలిపించుకోవడం ద్వారా విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు డీఎంకే నేతలు తెరవెనుక నల్లధనంతో రాజకీయం చేస్తున్నారని మంత్రి నిర్మల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి నిర్మల్ కుమార్ చేసిన ఆరోపణలను నిజం చేస్తూ తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన శాసనసభ్యుడు (ఎమ్మెల్యే) ఎన్. ఇళయరాజా మీడియా ముందుకు వచ్చి సంచలన విషయాలు వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వానికి మరియు స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ డీఎంకే పార్టీకి చెందిన ముఖ్య నేతలు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు. తమకు అనుకూలంగా మారితే ఏకంగా రూ.35 కోట్ల భారీ మొత్తాన్ని లంచంగా ఇస్తామని ఆశ చూపించారని ఇళయరాజా బహిరంగంగా ప్రకటించారు. తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు (హార్స్ ట్రేడింగ్) డీఎంకే బరితెగించిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయ బేరసారాలకు సంబంధించిన పూర్తి వివరాలతో జూన్ 29వ తేదీన టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా స్వయంగా గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌ను కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తన ఫిర్యాదు పత్రంలో ఆయన అసలు ఏం జరిగిందో క్షుణ్ణంగా వివరించారు. “కొన్ని రోజుల క్రితం తిరునావుక్కరసు అనే వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. తాను ‘ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్’ అనే పొలిటికల్ ఎగ్జిట్ పోల్ మరియు సర్వే సంస్థను నడుపుతున్నానని నమ్మబలికాడు. తాను ఒక ప్రధాన రాజకీయ పార్టీ అయిన డీఎంకే అగ్రనేతల అభ్యర్థన మేరకే నేరుగా నా వద్దకు రాయబారానికి వచ్చినట్లు స్పష్టంగా చెప్పాడు” అని ఇళయరాజా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదు ప్రకారం.. ఆ నిందితుడు తిరునావుక్కరసు మాట్లాడుతూ, త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ స్పీకర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక బలమైన అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాయని చెప్పాడు. ప్రస్తుత విజయ్ ప్రభుత్వ పతనాన్ని కాంక్షిస్తూ పెట్టే ఆ తీర్మానానికి టీవీకే ఎమ్మెల్యే అయిన ఇళయరాజా మద్దతుగా ఓటు వేయాలని కోరాడు. అలా చేస్తే డీఎంకే తరఫున రూ.35 కోట్లు ముడుతాయని ఆశ చూపాడు. అయితే ప్రజాక్షేమం కోరి గెలిచిన తాను ఆ దురాశ గల ప్రతిపాదనను ముఖం మీదే తిరస్కరించానని ఎమ్మెల్యే చెప్పారు. దీంతో కోపానికి గురైన తిరునావుక్కరసు, ఈ లంచం వ్యవహారాన్ని గానీ, డీఎంకే నేతల పేర్లను గానీ ఎవరికైనా చెబితే ప్రాణాలతో ఉండవని, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తనను తీవ్రంగా బెదిరించాడని ఇళయరాజా ఆరోపించారు.
ఎమ్మెల్యే ఇళయరాజా ఇచ్చిన పక్కా ఆధారాలు, ఫిర్యాదుపై గ్రేటర్ చెన్నై పోలీసులు తక్షణమే స్పందించారు. చెన్నైలోని డి1 ట్రిప్లికేన్ పోలీస్ స్టేషన్‌లో ప్రభుత్వ లంచజూపడం, ప్రజాప్రతినిధులను బెదిరించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నిందితుల కోసం గాలించాయి. ఈ క్రమంలోనే చెన్నై అరుంబాక్కం ప్రాంతానికి చెందిన ప్రధాన నిందితుడు తిరునావుక్కరసును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్న తిరుచిరాపల్లికి చెందిన నరేశ్, చెన్నై మేడవక్కం ప్రాంతానికి చెందిన త్యాగరాజన్ అనే మరో ఇద్దరిని బుధవారం నాడు పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులను సుదీర్ఘంగా విచారించగా, తమిళనాడు రాజకీయాలను కుదిపేసే మరికొన్ని సంచలన నిజాలు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్ వెనుక డీఎంకే పార్టీకి చెందిన అత్యంత ప్రభావవంతమైన నేతలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. డీఎంకే ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేసిన, ప్రస్తుత కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యే వి. సెంథిల్ బాలాజీ సొదరుడైన వి. అశోక్ కుమార్ స్వయంగా ఈ కుట్రను నడిపినట్లు తెలిసింది. చెన్నై నగరంలో నిందితుడు నరేశ్‌ను అశోక్ కుమార్ రహస్యంగా కలిశాడని.. వి. సెంథిల్ బాలాజీ, అతని తమ్ముడు అశోక్ కుమార్ ఇచ్చిన కచ్చితమైన ఆదేశాల మేరకే తాము రూ.35 కోట్ల డబ్బుతో టీవీకే ఎమ్మెల్యేకు ఎర వేసినట్లు నిందితులు ఒప్పుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై మరింత లోతుగా సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు చెన్నై పోలీసులు ప్రకటించారు.
ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆ రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డును సృష్టించాయి. దశాబ్దాల కాలంగా తమిళనాట మార్చి మార్చి అధికారాన్ని పంచుకుంటున్న ద్రావిడ దిగ్గజాలు డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఏకఛత్రాధిపత్యానికి ప్రజలు స్వస్తి పలికారు. కోట్లాది మంది అభిమానుల అండతో ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీని స్థాపించి, మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన అగ్రనటుడు విజయ్ ఊహించని ప్రజాదరణతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఏకంగా 108 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీ (మ్యాజిక్ ఫిగర్)కి కొద్దిపాటి దూరంలో నిలిచిపోయింది.
సొంతంగా స్పష్టమైన మెజారిటీ రాకపోయినప్పటికీ, రాష్ట్రంలో డీఎంకే అవినీతి పాలనకు చెక్ పెట్టడమే లక్ష్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్, దేశంలోని ప్రధాన వామపక్ష (కమ్యూనిస్ట్) పార్టీలు నటుడు విజయ్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఈ పార్టీల ఎమ్మెల్యేల మద్దతుతో విజయ్ విజయవంతంగా తమిళనాడు 13వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఎలాగైనా ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్లీ అధికారం దక్కించుకోవాలని డీఎంకే పగటికలలు కంటోందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. తమ కూటమి ఎమ్మెల్యేలు ఎవరూ అమ్ముడుపోయే ప్రసక్తే లేదని, డీఎంకే ఎన్ని కుతంత్రాలు చేసినా ప్రజల మద్దతుతో ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ఈ ఆదర్శ ప్రభుత్వం ఐదేళ్ల పాటు విజయవంతంగా కొనసాగుతుందని టీవీకే శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
