- దేశ అభివృద్ధిలో యువత కీలక భాగస్వామి కావాలి
- రాబోయే 30-35 ఏళ్లలో యువత పాత్రే నిర్ణాయకమని వ్యాఖ్య
- మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా నేర్చుకోవాలని సూచన
- 20-30 ఏళ్లలో ఎలాంటి మార్పులు వస్తాయో చెప్పలేమని వ్యాఖ్య
- సవాళ్లకు భయపడకుండా పరిష్కారాలపై దృష్టిపెట్టాలని హితవు
- యువతకు మోదీ దిశానిర్దేశం.. యువత సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉందన్న మోదీ
ఢిల్లీ, వెలుతురు, ఆగష్టు 8:
దేశ యువత సామర్థ్యాలపై తనకు ఎంతో నమ్మకం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి తరానికి దేశం పట్ల బాధ్యత ఉంటుందని, రాబోయే 30-35 ఏళ్లలో యువత చేసే కృషి దేశ భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. చదువు పూర్తిచేసుకుని వృత్తి జీవితంలోకి అడుగుపెడుతున్న యువత వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
ఎప్పుడూ ‘నిత్య విద్యార్థి’గా ఉండాలి
సాంకేతికతతో పాటు అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని మోదీ అన్నారు. రాబోయే 20-30 ఏళ్లలో ప్రపంచం ఎలా మారుతుందో ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదని పేర్కొన్నారు. అందువల్ల జీవితంలో ఎప్పుడూ కుతూహలాన్ని కొనసాగించాలని, కొత్త విషయాలను నేర్చుకోవడం ఆపకూడదని విద్యార్థులకు సూచించారు. నిరంతరం నేర్చుకునే వ్యక్తులే మారుతున్న పరిస్థితుల్లో విజయవంతంగా నిలుస్తారని అన్నారు.
సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలి
జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని చెప్పారు. పెద్ద సవాలు ఎదురైనప్పుడు దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కొక్క సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయాలని సూచించారు. కొత్త పరిష్కారాలను కనుగొనే ధైర్యమే సవాళ్లను అవకాశాలుగా మార్చగలదని అన్నారు. సమస్యలను ప్రశ్నించడం దగ్గరే ఆగిపోకుండా.. వాటికి పరిష్కారాలు కనుగొనడంపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు హితవు పలికారు.
దేశానికి ఏం చేయగలం?
ప్రతి తరానికీ జాతీయ బాధ్యత ఉంటుందని మోదీ గుర్తుచేశారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే 30-35 ఏళ్లలో యువత ఏం చేస్తుందనేదే వికసిత్ భారత్ నిర్మాణాన్ని నిర్ణయిస్తుందని అన్నారు. వ్యక్తిగత జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా.. దాని వల్ల దేశానికి ఏ విధంగా ప్రయోజనం కలుగుతుందో ఆలోచించాలని సూచించారు. ‘దేశ ప్రయోజనాల కోసం మనం ఏం చేయగలం?’ అనే ప్రశ్నను ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు.
మహిళల సంఖ్య పెరగాలి
స్నాతకోత్సవంలో ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు దీన్‌దయాల్ శర్మ స్వర్ణ పతకం, డైరెక్టర్ స్వర్ణ పతకాలను మోదీ ప్రదానం చేశారు. పతకాలు అందుకున్న వారిలో ఒకరిద్దరు మాత్రమే మహిళలు ఉండటాన్ని ప్రస్తావించిన ఆయన.. భవిష్యత్తులో అవార్డులు అందుకునే మహిళా విద్యార్థుల సంఖ్య మరింత పెరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో భాగంగా ఐఐటీ ఢిల్లీ సోనిపత్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత సూపర్ కంప్యూటింగ్ కేంద్రం పరం ప్రజ్ఞ’ను మోదీ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికత, పరిశోధన రంగాల్లో దేశ సామర్థ్యాలను మరింత పెంచేందుకు ఇటువంటి మౌలిక వసతులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.




