రవీంద్రభారతిలో ఆకట్టుకున్న కడ్డీ తంత్రి వాద్య సంగీతం, గౌడ పురాణం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాకళ 99 రోజుల సాంస్కృతిక మహోత్సవంలో భాగంగా 92వ రోజు రవీంద్రభారతి, పాల్కురికి సోమన్న మూల వేదికలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల సౌరభాన్ని ప్రతిబింబించే రెండు అరుదైన జానపద కళారూపాలు ప్రేక్షకులను ఆద్యంతం అలరించి విశేష ప్రశంసలు అందుకున్నాయి.

* పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత జానపద కళాకారుడు దురిశెట్టి రామయ్య బృందం ప్రదర్శించిన కడ్డీ తంత్రి వాద్య సంగీతం సభలో ఆధ్యాత్మిక, జానపద సంగీత మాధుర్యాన్ని విరజిమ్మింది. తంత్రి స్వరాల విన్యాసాలు, కళాకారుల అద్భుత ప్రతిభ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగా, సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.
* మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, వావిలాల గ్రామానికి చెందిన ముల్లంగిరి అంజయ్య గౌడజెట్టి బృందం ప్రదర్శించిన గౌడ పురాణం సంగీతం, నృత్యం, అభినయాల సమ్మేళనంగా సాగి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. గౌడ సమాజ చరిత్ర, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను హృద్యంగా ఆవిష్కరించిన ఈ ప్రదర్శనకు ప్రేక్షకులు హర్షధ్వానాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కీబోర్డుపై సైదుబాబు, తబలాపై బిక్షపతి, చైతన్య, ఏరుకొండ ప్రసాద్ తమ వాద్య సహకారంతో కార్యక్రమాన్ని మరింత రసవత్తరంగా తీర్చిదిద్దగా, గాయక బృందం తమ గానంతో కళారూపానికి మరింత శోభ తీసుకొచ్చింది.

అంతకుముందు తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రేలారే రేలా ప్రసాద్, వీణ, విద్యానందాచారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన “ప్రభాత బేరి” గీతాలతో పాటు జానపద, సామాజిక చైతన్య గీతాలను ఆలపించారు. అనంతరం కడ్డీ తంత్రి వాద్య సంగీతం, గౌడ పురాణం ప్రదర్శించిన కళాకారుల బృందాన్ని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నర్సింహా రెడ్డి, ఐఏఎస్ శాలువా కప్పి సత్కరించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ బాద్మి శివకుమార్‌, సహాయ సంచాలకులు పి. నర్సింలు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డా. పి. విజయ్ కుమార్, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు ముచర్ల దినకర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.