- ఉపాధి చట్టంపై సుప్రీంకోర్టుకు
- తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- కొత్త చట్టం అమలుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
- ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా మధ్యాహ్న భోజనం, బ్రేక్ ఫాస్ట్
- లక్షన్నర మంది సిబ్బందికి పథకం ప్రయోజనం
- టిమ్స్ ఆస్పత్రుల్లో 6,278 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
- మూసీ అభివృద్ధికి రూ.7,345 కోట్ల ఆమోదం
- మూసీ ప్రాజెక్టుకు 147 కొత్త పోస్టుల సృష్టి
- గిడ్డంగుల నిర్మాణానికి 60 ఎకరాల భూమి కేటాయింపు
- నవోదయ, కేంద్రీయ విద్యాలయాలకు ప్రభుత్వ భూములు
- పలు కీలక ప్రతిపాదనలకు క్యాబినెట్ ఆమోదం
హైదరాబాద్ వెలుతురు జూలై 02:
తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ గురువారం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టం, పాఠశాలల్లో ఉపాధ్యాయులకు భోజన పథకం, టిమ్స్ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీ, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, గిడ్డంగులు, విద్యాసంస్థలకు భూముల కేటాయింపు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఉపాధి హామీ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రామ్‌జీ చట్టంలోని నిబంధనలపై క్యాబినెట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాలను సంప్రదించకుండా చట్టం తీసుకురావడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. అయితే ఇతర రాష్ట్రాలన్నీ అమలుకు ముందుకొచ్చిన నేపథ్యంలో, ఉపాధి హామీ కూలీలకు పనులు ఆగకుండా ఉండేందుకు జూలై 1, 2026 నుంచి రాష్ట్రంలో చట్టాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అదే సమయంలో చట్టంలోని నిబంధనలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని, పార్లమెంట్‌లో కూడా కేంద్ర ప్రభుత్వ తీరును నిలదీయాలని నిర్ణయించింది.
ఉపాధ్యాయులకు కూడా అల్పాహారం, భోజనం
ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కూడా అల్పాహారం, పాలు, మధ్యాహ్న భోజనం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు లక్షన్నర మంది ఉపాధ్యాయులు, సిబ్బందికి ఈ నిర్ణయం వర్తించనుంది.
టిమ్స్ ఆస్పత్రుల్లో 6,278 పోస్టులు
సనత్‌నగర్, ఎల్‌బీనగర్, అల్వాల్ టిమ్స్‌తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మొత్తం 6,278 పోస్టుల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 1,494 రెగ్యులర్, 549 కాంట్రాక్ట్, 4,235 ఔట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి. ఈ ఆస్పత్రులను నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.
మూసీ రివర్ ఫ్రంట్‌కు రూ.7,345 కోట్ల ఆమోదం
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ తొలి దశ పనులకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. తొలి దశలో 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ప్రాజెక్టు నిర్వహణ కోసం కొత్తగా 147 పోస్టులు సృష్టించేందుకు కూడా ఆమోదం తెలిపింది.
గిడ్డంగులు, విద్యాసంస్థలకు భూముల కేటాయింపు
వరంగల్ జిల్లా బొల్లికుంట, రంగారెడ్డి జిల్లా కర్కాలపహాడ్‌లో గిడ్డంగుల నిర్మాణానికి మొత్తం 60 ఎకరాల భూమిని తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు కేటాయించాలని నిర్ణయించింది. అలాగే మహబూబ్‌నగర్, సూర్యాపేట జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు, జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ భూములను కేటాయించింది.
