- ఎక్స్ వేదికగా రెండు పార్టీలపై కేంద్ర మంత్రి విమర్శలు
- ముందే రిహార్సల్ చేసి రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా
- గురుకులాల టెండర్లు, అప్పులపై చర్చకు రావాలని సవాల్
- అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటన
- బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో వేదిక ఏర్పాటు చేస్తాం
- ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఉందా?
- మోదీ ప్రభుత్వ నిధులు, సంక్షేమంపైనా చర్చిద్దామని సవాల్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను బయటపెడుతాం
- ప్రజలు రాజకీయ డ్రామాలను గమనిస్తున్నారని హెచ్చరిక
- తెలంగాణలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు
హైదరాబాద్ వెలుతురు జూలై 02:
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన.. ఇరు పార్టీల నేతల తీరు రాజకీయ బిగ్‌బాస్ షోను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రతి వారం ముందే రిహార్సల్ చేసుకుని పోటాపోటీగా నటిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారని, అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలిద్దరూ అర్హులేనని వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలను అమాయకులుగా భావించవద్దని, ప్రజలు అన్నింటినీ గమనిస్తూ నవ్వుకుంటున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులు, అవినీతి, అక్రమాల అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో తేదీ, సమయం, వేదికను ఖరారు చేస్తామని తెలిపారు.
ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధమా అని ప్రశ్నించిన బండి సంజయ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ప్రజల ముందుంచేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కేటాయించిన నిధులు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఇరు పార్టీలు రాజకీయ డ్రామాలు కొనసాగిస్తే ప్రజలు తప్పకుండా తిరస్కరిస్తారని బండి సంజయ్ హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ బిగ్‌బాస్ షోలో ప్రజలు ‘డబుల్ ఎలిమినేషన్’ కోరుకుంటున్నారని, తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.
