- గురుకులాల కొనుగోళ్లపై చర్చకు ఇరు పక్షాల సిద్ధత
- హైదరాబాద్‌లో రాజకీయంగా వేడెక్కిన వాతావరణం
- గన్‌పార్క్ వద్దకు చేరుకున్న కాంగ్రెస్ మంత్రులు
- సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చర్చకు రావాలని ఆహ్వానం
- తెలంగాణ భవన్ నుంచి బయల్దేరిన హరీశ్‌రావు
- హరీశ్‌రావును అడ్డుకున్న పోలీసులు.. తోపులాట
- బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం
- పారదర్శకంగా టెండర్లు నిర్వహించామని కాంగ్రెస్ స్పష్టం
- అప్పులు, గురుకులాల అంశాలపై చర్చకు సిద్ధమన్న బీఆర్‌ఎస్
- హరీశ్‌రావుతో పాటు పలువురు నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ వెలుతురు జూలై 02:
హైదరాబాద్‌లో గురుకుల విద్యాసంస్థల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న ఆరోపణలతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ పోరు మరింత ఉధృతమైంది. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకోవడంతో రాజధానిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు పార్టీల నేతలు చర్చకు సిద్ధమని ప్రకటించగా, గన్‌పార్క్ పరిసరాల్లో పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
గురుకులాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందన్న బీఆర్‌ఎస్ ఆరోపణలపై బహిరంగంగా చర్చించేందుకు కాంగ్రెస్ మంత్రులు ముందుకొచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ తదితరులు గన్‌పార్క్ వద్దకు చేరుకుని మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ మంత్రులు ఎవరైనా చర్చకు రావచ్చని, సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని విమర్శించారు. గురుకుల హాస్టళ్లలో అవినీతి జరిగిందని కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మొత్తం కొనుగోలు ప్రక్రియను నాలుగు శాఖల ఆధ్వర్యంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. టెండర్లలో పాల్గొనే అవకాశం అందరికీ కల్పించామని, ప్రజలు ఎన్నుకున్న నాయకులే చర్చకు రావాలని కోరారు. గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కొనుగోళ్లపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులు, ఆర్థిక నిర్వహణపై కూడా చర్చించేందుకు తాము సిద్ధమని బీఆర్‌ఎస్ ప్రకటించింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్‌కు వచ్చి అప్పుల అంశంపై చర్చిస్తానని చెప్పారని, అందుకే కేటీఆర్ అక్కడే ఉంటారని హరీశ్‌రావు తెలిపారు.
తాను ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఇతర నేతలతో కలిసి గన్‌పార్క్‌కు వెళ్లి మంత్రులను కలుస్తానని ప్రకటించిన హరీశ్‌రావు తెలంగాణ భవన్ నుంచి బయల్దేరారు. అయితే మార్గమధ్యంలో పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చర్చకు వస్తున్న తమను ఎందుకు అడ్డుకుంటున్నారని హరీశ్‌రావు పోలీసులను ప్రశ్నించారు.
హాస్టళ్లలో అవినీతి జరిగిందనే విషయాన్ని ప్రభుత్వం ఎదుర్కోలేకే పోలీసులను అడ్డుపెట్టుకుంటోందని హరీశ్‌రావు ఆరోపించారు. గన్‌పార్క్‌కు నడుచుకుంటూ వెళ్తామని ప్రకటిస్తూ కారు దిగి ముందుకు సాగేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో బీఆర్‌ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. పోలీసు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
చివరికి పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో గన్‌పార్క్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. గురుకులాల కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.
