- ఎల్ నినో తీవ్రతపై ప్రజా ప్రభుత్వ ముందస్తు వ్యూహం
- వైరా రిజర్వాయర్‌కు చేరుతున్న గోదావరి జలాలు
- వెంకటాయపాలెం వద్ద కాలువ ప్రవాహాల పరిశీలన
- సీతారామ పథకం ద్వారా నీటి మళ్లింపు
- యుద్ధప్రాతిపదికన చెరువులు, జలాశయాల నింపుదల
ఖమ్మం, జూన్ 23 (వెలుతురు):
ఎల్ నినో తీవ్రత వల్ల రానున్న రోజుల్లో ఖమ్మం జిల్లాలోని ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకూడదనే దృఢ సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వేసవిలో నీటి కొరత పరిస్థితులను ముందే ఊహించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
వైరా రిజర్వాయర్‌కు గోదావరి జలాలు
ఈ రోజు వెంకటాయపాలెం సమీపంలో ఎన్‌ఎస్పీ ప్రధాన కాలువ మీదుగా వైరా రిజర్వాయర్‌కు వేగంగా చేరుతున్న గోదావరి జలాలను డిప్యూటీ సీఎం క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించారు. దుమ్ముగూడెం (సీతారామ ఎత్తిపోతల పథకం) నుంచి రాజీవ్ లింక్ కాలువ ద్వారా మళ్లించిన నీరు జలాశయానికి చేరుతుండటం, ప్రవాహ వేగాన్ని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
యుద్ధప్రాతిపదికన చెరువుల నింపుదల
గోదావరి నుంచి మళ్లించిన జలాలతో ఖమ్మం జిల్లాలోని ప్రధాన చెరువులు, నీటి వనరులు మరియు జలాశయాలను యుద్ధప్రాతిపదికన నింపాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రతి నీటి బొట్టునూ సమర్థవంతంగా సద్వినియోగం చేస్తూ, నీటి సరఫరాలో ఎక్కడా వ్యర్థాలు, ఆటంకాలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
ముందస్తు ప్రణాళికతో జిల్లాలోని ప్రతి నీటి వనరును సమర్థవంతంగా వినియోగిస్తూ, ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడటమే మన ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, జిల్లావ్యాప్తంగా తాగునీటి నిల్వలను సమ సమర్థంగా నిర్వహించాలని నీటిపారుదల మరియు సంబంధిత శాఖల అధికారులకు భట్టి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
—
