- విద్యార్థుల సంక్షేమంలో తగ్గే ప్రసక్తే లేదు
- కార్పొరేట్‌కు పోటీగా గురుకులాలు
- సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్‌లో తనిఖీ
- పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదు
- విద్యార్థులకు వెల్‌కమ్ కిట్ల పంపిణీ
- డైట్ ఛార్జీల పెంపుతో పౌష్టికాహారం
- స్పష్టం చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్
హైదరాబాద్, జూన్ 23 (వెలుతురు):
రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థలను ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని రీతిలో అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దుతున్నామని తెలంగాణ రాష్ట్ర సాంఘిక, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ విద్యాసంస్థను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల బోధనా ప్రమాణాలు, వసతి గృహాలు, పారిశుధ్యం, భోజన వసతులు, విద్యా వాతావరణాన్ని క్షేత్రస్థాయిలో అడిగి తెలుసుకున్నారు.తనిఖీ అనంతరం కొత్తగా చేరిన విద్యార్థులకు 11 రకాల నిత్యావసర వస్తువులతో కూడిన ‘వెల్‌కమ్ కిట్ల’ను మంత్రి పంపిణీ చేశారు. ఈ కిట్‌లో ప్లేటు, గ్లాసు, గిన్నె, కప్పు, స్పూను, బెడ్‌షీట్, టవల్, బ్లాంకెట్, షూస్, సాక్స్, స్కూల్ బ్యాగ్ ఉన్నాయి. అలాగే జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ చాటిన విద్యార్థులను మంత్రి ప్రత్యేకంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదరికం అనేది ఏ ఒక్కరి ప్రతిభకు లేదా ఎదుగుదలకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలను ఉచితంగా అందిస్తోందని స్పష్టం చేశారు.
చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న డైట్ ఛార్జీలను ప్రస్తుత ప్రభుత్వం గణనీయంగా పెంచిందని మంత్రి అడ్లూరి గుర్తుచేశారు. దీనివల్ల గురుకులాల్లో చదువుకునే విద్యార్థులకు రోజూ బలవర్ధకమైన, పౌష్టికాహారాన్ని అందించడం సాధ్యమవుతోందన్నారు. సరైన పోషకాహారం లభించడం వల్ల పిల్లల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఏకాగ్రత, చదువుపై శ్రద్ధ పెరుగుతాయని, ఇది వారి విద్యా నైపుణ్యాలను మెరుగుపరచడానికి ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు దేశంలోనే అత్యుత్తమ విద్యను అందించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని తెలిపారు. సంక్షేమ వసతి గృహాలను కేవలం నివాస కేంద్రాలుగా కాకుండా, ప్రతిభను వెలికితీసే విజ్ఞాన నిలయాలుగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని గురుకుల విద్యార్థులు కేవలం వార్షిక పరీక్షల్లోనే కాకుండా, నీట్, జేఈఈ , ఈఏమ్‌సెట్ వంటి ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో అద్భుతమైన ర్యాంకులు సాధిస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఆటలు, ఇతర సృజనాత్మక అంశాల్లో కూడా మన పిల్లలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పథకాలు సాధిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ పాఠశాల విద్యార్థులు కూడా అదే స్ఫూర్తితో చదివి దేశానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. గురుకులాల్లో చదువుకునే పిల్లలకు నాణ్యమైన చదువు అందించేందుకు విద్యా మౌలిక సదుపాయాలను భారీగా ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. తరగతి గదులను డిజిటలైజ్ చేయడం, అత్యాధునిక సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్‌లను అందుబాటులోకి తేవడం, గ్రంథాలయాలను విస్తరించడం, నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించడం ద్వారా గురుకులాల రూపురేఖలు మారుస్తున్నామని వివరించారు.
గత ప్రభుత్వ హయాంలో గురుకులాలకు సంబంధించి నిలిచిపోయిన నిధులను, బకాయిలను ప్రస్తుత ప్రభుత్వం తక్షణమే విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. నిధుల విడుదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన మౌలిక వసతుల కల్పన పనులు, భవనాల మరమ్మతులు, నూతన నిర్మాణ పనులు ప్రస్తుతం వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. సంక్షేమ విద్యాసంస్థలకు నిధుల కొరత లేకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు.కేవలం వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యం కాదని, ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, భవిష్యత్ నాయకత్వ పాత్రల్లో మన పిల్లలు విజయం సాధించేలా తీర్చిదిద్దడమే తమ అసలు లక్ష్యమని మంత్రి ఆకాంక్షించారు. ప్రతి గురుకుల విద్యార్థి తనలోని పూర్తి సామర్థ్యాన్ని గుర్తించి, దేశాభివృద్ధిలో భాగస్వామి అయ్యే వాతావరణాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి విజయేంద్ర బోయి, విక్టోరియా మెమోరియల్ సంస్థ కార్యదర్శి సల్మా బాను, ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, సూపర్వైజర్ లక్ష్మీ పార్వతి తదితర అధికారులు పాల్గొన్నారు.
