హుస్నాబాద్ వెలుతురు జూలై 23:
రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతాంగం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ అయ్యప్ప ఆలయంలో 108 మంది రుత్వికులతో, 21 హోమగుండాలతో నిర్వహించిన శ్రీ వారాహి మూల మంత్ర హోమ మహాయజ్ఞంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో మరకత శివాలయంలో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొని రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండిపోవాలని, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రైతాంగం ఆందోళన చెందుతోందన్నారు. అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయం పుంజుకోవాలని, రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు.
ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల సంక్షేమంతో పాటు “సర్వేజనా సుఖినో భవంతు” అనే భావనతో సమాజ శ్రేయస్సు కోసం కూడా ప్రార్థించాలని మంత్రి పిలుపునిచ్చారు. రైతు అభివృద్ధి చెందితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, రైతు బాగుంటేనే వ్యాపారులు, కార్మికులు, చేతివృత్తులవారు సహా సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
వారాహి అమ్మవారి కృపాకటాక్షంతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఇంట ఆనందం వెల్లివిరియాలని మంత్రి కోరుకున్నారు. ఈ మహాయజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న వేద పండితులు, నిర్వాహకులు, యజ్ఞ దంపతులను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమాల్లో హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, వేద పండితులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


