ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ

  • యూనిఫాంల నాణ్య‌త‌పై రాజీప‌డేది లేదు 
  • పంపిణీలో అల‌స‌త్వం వ‌హిస్తే క‌ఠిన చ‌ర్య‌లు
  • త్వ‌ర‌గా స‌ర‌ఫ‌రా చేసేలా సంస్థ‌ల‌పై ఒత్తిడి పెంచాలి
  • యూనిఫాం స‌ర‌ఫ‌రాపై స‌మీక్ష‌లో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

హైదరాబాద్, జూన్ 23 (వెలుతురు):

యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌) తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఇచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా వ‌చ్చే ఏడాది పంపిణీ, వాటి రంగులు ఇత‌ర అంశాల‌పై నిర్ణ‌యం తీసుకుంటామ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు. విద్యార్థుల‌కు యూనిఫాంల అంద‌జేత‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో గురువారం స‌మీక్ష నిర్వ‌హించారు. ప్ర‌భుత్వ పాఠ‌శాలలు, వ‌స‌తిగృహాల్లో చ‌దివే విద్యార్థులకు అంద‌జేసే యూనిఫాంల నాణ్య‌త‌లో రాజీప‌డ‌మ‌ని సీఎం తెలిపారు. ఆగ‌స్టు 15వ తేదీ నాటికి పిల్ల‌లంద‌రికీ యూనిఫాం అంద‌జేయాల్సిన‌దేన‌ని  అధికారుల‌ను ఆదేశించారు. ఈ విష‌యంలో అల‌సత్వం వ‌హిస్తే స‌హించ‌న‌ని సీఎం హెచ్చ‌రించారు. మ‌హిళా సంఘాలు కుట్టు ప‌ని వేగ‌వంతం చేసేలా క‌లెక్ట‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) సీఈవో దివ్యాదేవరాజన్‌కు సీఎం సూచించారు.

గత ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యార్థుల‌కు యూనిఫాంల అంద‌జేత‌లో అడ్డ‌గోలుగా వ్యవహరించిందని, తాము వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని, నాణ్య‌మైన యూనిఫాంలు అందిస్తామ‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. పేద పిల్లల కోసం పని చేస్తున్నామని అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు సూచించారు. వచ్చే సంవ‌త్స‌రం జూన్ 2వ తేదీ నాటికే విద్యార్థుల‌కు యూనిఫాం అందేలా కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ  స‌మీక్ష‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు పి.సుద‌ర్శ‌న్ రెడ్డి, స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ స‌బ్య‌సాచి ఘోష్‌, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్‌.శ్రీ‌ధ‌ర్‌, సీఎం ఓఎస్‌డీ వేముల శ్రీ‌నివాసులు, ఆయా శాఖ‌ల అధికారులు బాల మాయాదేవి, ష‌ఫీ ఉల్లా, విజ‌యేంద్ర బోయి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.