రాత్రి 9 గంటలు. హాస్టల్ గదిలో లైట్లు ఆరిపోయాయి. అందరూ నిద్రపోతున్నారు. కానీ మూలన ఉన్న బెడ్ మీద 8 ఏళ్ల విద్యార్థి కళ్ల నుంచి నీళ్లు ఆగడం లేదు. దిండులో ముఖం పెట్టుకుని “అమ్మా… నాకు జ్వరం వచ్చింది… ఒక్కసారి నువ్వు నా నుదుటికి చెయ్యి పెట్టు” అని గుసగుసలాడుతున్నా మాటలు. పక్కన ఓదార్చడానికి ఎవరూ లేరు.
ఇది సినిమా సీన్ కాదు అన్నా. ఇది మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ లలో జరుగుతున్న పసి మొగ్గల బాల్యం…
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లలో ప్రతిరోజు జరుగుతున్న నిజం. హాస్టల్ అంటే చదువుకోవడానికి ఒక చోటు. కానీ ఇప్పుడు అదే పిల్లలకు “బంధీ జైలు” లా మారింది.
ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు రూల్, రూల్, రూల్. అమ్మతో గొడవ, నాన్నతో సరదా, తాత కథలు, అమ్మమ్మ ముద్ద… ఇవేవీ లేకుండా పెరుగుతున్నారు. తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే 10వ తరగతికి వచ్చేస్తున్నారు. “ప్రేమ” అనే పదానికి అర్థం పుస్తకంలోనే చదువుతున్నారు కానీ, ఇంట్లో అనుభవించడం లేదు.
*”చదువు కోసం బాల్యాన్ని అమ్మేస్తున్నామా?”*
పేదరికం, మంచి చదువు కావాలనే ఆశతో తల్లిదండ్రులు 3వ, 4వ తరగతి పిల్లలనే హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. “మా బిడ్డ ఐఏఎస్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి” అనే కలతో ఇంటి నుంచి పంపిస్తున్నారు. కానీ ఆ కల మధ్య పిల్లలు కోల్పోతున్నది ఎంతో ఉంది. ఇంట్లో అమ్మ చేతి ముద్ద, నాన్న చెప్పే కథలు, అన్నతో ఆటలు… ఇవన్నీ ఇప్పుడు జ్ఞాపకాలు మాత్రమే. ఇక్కడ ఉదయం 5 గంటలకు లేవడం, తన బట్టలు తానే ఉతుక్కోవడం, లైన్ లో నిలబడి అన్నం తినడం, రాత్రి ఒంటరిగా భయపడుతూ పడుకోవడం. చేతికి మట్టి అంటకుండా పెరగాల్సిన పిల్లలు, ఇక్కడ తమ పని తామే చేసుకుంటూ “పెద్దవాళ్లు” అయిపోతున్నారు.
*”ఆదివారం అంటే పండగ”*
హాస్టల్ విద్యార్థులకు వారంలో 7 రోజులు ఉంటాయి. కానీ వాళ్లకు కనిపించేది ఒక్కటే రోజు ఆదివారం… శనివారం రాత్రి నుంచే “రేపు అమ్మ వస్తుందా?” “నాన్న వస్తాడా?” అని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. తల్లిదండ్రులు వచ్చిన రోజు హాస్టల్ గేటు దగ్గర పిల్లల సందడి చూడాల్సిందే. గంటసేపు కలిసి, మళ్లీ “వచ్చే వారం వస్తా నాన్న” అని చెప్పి వెళ్లిపోతుంటే ఆ పసి కళ్లలోని బాధ చూస్తే గుండె తరుక్కుపోతుంది. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు రాలేని పరిస్థితి లో ఆ హాస్టల్ గెట్ పట్టుకొని ఎదురు చూస్తూ కంటతడి పెడుతుంటే ఎవరైనా కన్నీళ్లు పెట్టాల్సిందే…
పుట్టినరోజు వచ్చినా ఇంట్లో లేదు. కేక్ కోసి స్నేహితులు “హ్యాపీ బర్త్ డే” అంటారు. కానీ అమ్మ కౌగిలి, నాన్న ఇచ్చే గిఫ్ట్ ఉండదు కదా.
*అన్నిటికంటే బాధాకరం ఏంటంటే…*
ఆదివారం తల్లిదండ్రులు వచ్చినా 1 గంటలో “సార్ సెలవు అయిపోయింది” అంటూ మళ్లీ హాస్టల్ లోపలికి పంపేస్తున్నారు. ఆ ఒక్క గంటలో బంధం ఎలా పెరుగుతుంది? పుట్టినరోజు, పండగలు అన్నీ హాస్టల్లోనే. కేక్ కట్ చేస్తారు కానీ అమ్మ కౌగిలి ఉండదు. కొత్త బట్టలు ఇస్తారు కానీ నాన్న ఆశీర్వాదం ఉండదు అంటూ ఆదివారం నాడు వచ్చిన అమ్మ లతో వారి బాధను పంచుకుంటున్నారు.
ఇక్కడ అన్నం బాగుంటుంది. కానీ నువ్వు పెట్టిన ముద్దలా ఉండదు.
రాత్రి నాకు భయం వేస్తుంది. నువ్వు దగ్గరికి వచ్చి కథ చెప్పితే బాగుంటుంది అంటూ చెప్పి, మళ్ళీ ఆదివారం త్వరగా రా అమ్మ… అంటూ కన్నీళ్ల తో పలుకుతున్న మాటలు వింటుంటే గుండె తరుక్కు పోతుంది.
*”ఇక్కడ మాకు ఎవరూ లేరు సార్”*
“సార్ రాత్రి కలలో అమ్మ కనిపించింది. ఉదయం లేచేసరికి లేదు” అంటూ విద్యార్థులు కన్నీరు పెట్టుకోవడం, “జ్వరం వచ్చినా ఇక్కడ మమ్మల్ని ఎవరూ దగ్గరికి తీసుకోరు. ఇంట్లో అయితే అమ్మ తలకు తడి గుడ్డ పెట్టేది” అని విద్యార్థులు బాధతో చెప్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. హాస్టల్ అంటే కేవలం భోజనం, వసతి కాదు. అది పిల్లల రెండో ఇల్లు కావాలి. కానీ చాలా చోట్ల సిబ్బంది కొరత, నిర్లక్ష్యం వల్ల పిల్లలు మానసికంగా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు.
*తల్లిదండ్రుల ఆవేదన: “తప్పనిసరి పరిస్థితి”
“మాకు ఇష్టమై పంపడం లేదు సార్. పొలం పనులు, ఆర్థిక ఇబ్బందులు. ఇంట్లో ఉంచితే సరిగ్గా చదివించలేం. అందుకే కడుపు కోతతో పంపిస్తున్నాం” అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంటే ప్రతీ ఒక్కరూ చలించి పోవాల్సిందే..
“చదువుకొనుడు ఏమో గానీ… మా బిడ్డ ప్రేమకు దూరం కాకూడదు” అని చెప్పే వారి మాటలు ఎవరి గుండెనైనా కదిలిస్తాయి.
నిపుణులు ఏం చెబుతున్నారు?
బాల మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. “10 నుండి 15 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల సాన్నిహిత్యం చాలా అవసరం. ఈ వయసులో దూరం చేస్తే వాళ్లలో భయం, డిప్రెషన్, చదువుపై ఆసక్తి తగ్గడం లాంటి సమస్యలు వస్తాయి. చదువు ముఖ్యమే కానీ, బాల్యాన్ని చంపి కాదు” అని అంటున్నారు.
వాళ్లకు కావాల్సింది చదువు కాదు… ప్రేమ
హాస్టల్ లో ఉన్న పిల్లలకు కావాల్సింది ఫ్యాన్సీ ఫుడ్ కాదు, కొత్త బట్టలు కాదు. వాళ్ల చిన్న గుండెలకు కావాల్సింది 4 విషయాలే
ప్రేమ
“అమ్మ ఫోన్ చేసింది” అనే ఒక్క మాట చాలు వారానికి కనీసం 2 సార్లు తల్లిదండ్రులు ఫోన్ చేసి మాట్లాడాలి. “అన్నం తిన్నావా నాన్న? హోం వర్క్ చేస్తున్నావా?” అనే ఒక్క ప్రశ్న చాలు. హాస్టల్ మొత్తంలో “నా అమ్మ ఫోన్ చేసింది” అని గర్వంగా చెప్పుకుంటారు. ఆ 5 నిమిషాల మాటలు వాళ్లకు ఒక వారం ధైర్యం ఇస్తాయి.
భరోసా
“నువ్వు ఒంటరిగా లేవురా” రాత్రి జ్వరం వచ్చినా, స్కూల్లో టీచర్ తిట్టినా, స్నేహితులతో గొడవైనా… “ఏమైంది నాన్న?” అని అడిగే ఒక గొంతు కావాలి. “భయపడకు, మేమున్నాం” అనే ఒక్క మాట చాలు. లేకపోతే ఆ పసి మనసులో “నన్ను ఎవరూ ప్రేమించడం లేదు” అనే భావన వచ్చేస్తుంది.
సమయం
నెలకు ఒకసారైనా కౌగిలి ఇవ్వాలి. డబ్బులు, గిఫ్టులు వద్దు. నెలకు ఒకసారైనా హాస్టల్ కి వచ్చి, పిల్లాడి కళ్లలోకి చూసి, తల నిమిరి, వాడు చెప్పేది అంతా ఓపికగా వినాలి. ఆదివారం గేటు దగ్గర “నాన్న వచ్చాడు” అని పరిగెత్తే ఆ ఆనందం కోసమే వాళ్లు 30 రోజులు ఎదురు చూస్తారు.
హాస్టల్ బాధ్యత
వార్డెన్ కాదు… రెండో అమ్మ, నాన్న హాస్టల్ వార్డెన్లు, కేర్ టేకర్లు ఉపాధ్యాయులుగా కాకుండా తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవాలి. పిల్లాడికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, రాత్రి దుప్పటి కప్పడం, పుట్టినరోజున కేక్ కట్ చేయించడం. హాస్టల్ అంటే జైలు కాదు, అది కూడా ఒక ఇల్లు అనే ఫీలింగ్ రావాలి.
చివరి మాట
చదువు కోసం హాస్టల్ తప్పు కాదు. కానీ చిన్నప్పటి నుంచే ఇంటికి దూరం చేయడం వల్ల మనం ఒక తరం పిల్లల బాల్యాన్ని దోచేస్తున్నామేమో?
“అమ్మ చేతితో అన్నం తినాల్సిన వయసులో, హాస్టల్ గదిలో ఒంటరిగా కూర్చుని ఏడవాల్సిన పరిస్థితి రాకూడదు.”
చదువుతో పాటు ప్రేమను కూడా ఇద్దాం. అప్పుడే ఆ పసి మొగ్గలు నిజంగా వికసిస్తాయి.
చదువు కోసం ఇంటికి దూరం చేశాం. కానీ ప్రేమకు దూరం చేయొద్దు. ఎందుకంటే మార్కులు మర్చిపోతారు… కానీ మమతలు మర్చిపోరు.
చదువు కోసం హాస్టల్ పంపడం తప్పు కాదు. కానీ,బంధాలను చంపి చదువు ఇవ్వొద్దు.
ఎందుకంటే 10వ తరగతిలో 10/10 మార్కులు తెచ్చినా, జీవితంలో “మానవత్వం” లో ఫెయిల్ అయితే ఏం లాభం?
ఫలితం
పెద్దయ్యాక ఈ పిల్లలకు బంధాల విలువ తెలియదు. “నాది నా చదువు, నా కెరీర్” అనే స్వార్థం పెరుగుతుంది. అందుకే ఈరోజు చాలా మంది వృద్ధులు ఒంటరిగా ఉండాల్సి వస్తుంది.

రంగ కవిత గౌడ్
యాదాద్రి భువనగిరి జిల్లా వెలుతురు స్టాఫర్
