కంగనా రనౌత్ Vs సౌరవ్ దాస్ మధ్య మాటల యుద్ధం

  • ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోండి
  • సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్​పై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు
  • సౌరవ్ దాస్ విమర్శలకు సోషల్ మీడియాలో బీజేపీ ఎంపీ కౌంటర్
  • 28 ఏళ్లకే నాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి
  • తాను ఎంపీ మాత్రమే కాదు.. దర్శకురాలు, నిర్మాత, వ్యాపారవేత్తనని స్పష్టం
  • పనిలేని వారికి బాధ్యతల విలువ తెలియదు అంటూ ఎద్దేవా
  • నీట్ ఆందోళనలపై వ్యాఖ్యలతో మొదలైన వివాదం వ్యక్తిగత విమర్శలకు దారి
  • ఇద్దరి మధ్య మాటల యుద్ధం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం

ఢిల్లీ, వెలుతురు (జూన్ 29):

నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై విద్యార్థుల ఆందోళనల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై చీఫ్ కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ విమర్శలు చేయడంతో బీజేపీ ఎంపీ, సినీ నటి కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు. తాను 28 ఏళ్ల వయసులోనే రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని గుర్తు చేస్తూ, “ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోండి” అంటూ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సౌరవ్ దాస్ తనపై చేసిన వ్యాఖ్యలకు కంగనా సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులతో సమాధానం ఇచ్చారు. తాను రెండేళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, గత 20 ఏళ్లుగా ప్రజా జీవితంలో కొనసాగుతున్నానని తెలిపారు. సౌరవ్ దాస్ వయసు 28 ఏళ్లు ఉన్నప్పుడే తాను రెండు జాతీయ అవార్డులు అందుకున్నానని పేర్కొన్నారు.

తాను కేవలం ఎంపీ మాత్రమే కాదని, సినీ దర్శకురాలు, నటి, నిర్మాత, కథా రచయిత, వ్యాపారవేత్తనని కంగనా చెప్పారు. ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తూనే సినిమాలు, రచనలు, వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్నానని, అలాంటి పనిభారం ఏమిటో పనిలేని వారికి అర్థం కాదని వ్యాఖ్యానించారు.

సౌరవ్ దాస్‌ను ఉద్దేశించి.. “మీ సమస్యలు వ్యక్తిగతమైనవి. మీరు విద్యార్థి కాదు. పూర్తిగా పనిలేని వ్యక్తి. ముందు ఏదైనా నైపుణ్యం నేర్చుకోండి. అక్కడి నుంచే ప్రారంభించండి” అంటూ కంగనా విమర్శించారు.

అంతకుముందు సౌరవ్ దాస్ మాట్లాడుతూ.. కంగనా రనౌత్‌ను సొంత పార్టీ నేతలే అంతగా సీరియస్‌గా తీసుకోవడం లేదని అన్నారు. జెన్-జీ, జెన్-ఆల్ఫా తరాలకు కూడా ఆమె వ్యాఖ్యలు పెద్దగా ప్రభావం చూపడం లేదని వ్యాఖ్యానించారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత పని భారం గురించి కంగనా గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఆమె రాజకీయాల పట్ల ఎంత సీరియస్‌గా ఉన్నారో అవే చెబుతున్నాయని విమర్శించారు.

ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై జరిగిన విద్యార్థుల ఆందోళనలను కంగనా విమర్శించారు. నిరసనల్లో అసభ్య పదజాలం, వ్యక్తిగత దూషణలు సమాజం అంగీకరించదని ఆమె వ్యాఖ్యానించారు. ఆందోళనలకు సంబంధించిన వీడియోలను “చూడలేనంత అసహ్యంగా ఉన్నాయి” అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీల్లో పోస్టు చేశారు.

నీట్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సీజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆందోళనలను విరమించారు. అయితే ఆ అంశంతో ప్రారంభమైన వివాదం ఇప్పుడు కంగనా రనౌత్, సౌరవ్ దాస్ మధ్య వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది.

Leave A Reply

Your email address will not be published.