హుస్నాబాద్, వెలుతురు జూలై 29:
హుస్నాబాద్ మండలంలోని అన్ని గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, మంజూరైన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హుస్నాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో గ్రామాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, తాగునీటి సమస్యలు, వ్యవసాయ రంగం, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, పంచాయతీరాజ్, రోడ్లు, విద్యా రంగం, ఉపాధి హామీ పనులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ముందస్తు అనుమతి లేకుండా సమావేశానికి గైర్హాజరైన విద్యుత్ శాఖ ఏఈ తీరుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్రామ సభలకు సైతం ఏఈ హాజరుకావడం లేదని సర్పంచులు మంత్రి దృష్టికి తీసుకురాగా, ప్రజలకు అందుబాటులో ఉండకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. శాతవాహన యూనివర్సిటీ పనుల కోసం రూ.15 లక్షలు చెల్లించినప్పటికీ ఇప్పటివరకు విద్యుత్ కనెక్షన్ ఎందుకు ఇవ్వలేదని మంత్రి అధికారులను నిలదీశారు. సంబంధిత సమస్యను వెంటనే పరిష్కరించి విద్యుత్ కనెక్షన్ అందించాలని ఆదేశించారు.
హుస్నాబాద్ మండలంలో మంజూరైన 240 ఇందిరమ్మ ఇండ్లలో ఇప్పటికే 210 ఇండ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. మిగిలిన ఇండ్ల పనులను వెంటనే ప్రారంభించాలని, నిర్లక్ష్యం చేస్తే ఆయా ఇళ్ల మంజూరులను రద్దు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసిన గ్రామాలకే తదుపరి విడతలో ప్రాధాన్యతనిస్తూ అదనపు ఇండ్లను మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, పెండింగ్ టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో మంజూరైన అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
పొట్లపల్లి, పందిళ్ళ, కోహెడ రూట్లలో తక్షణమే ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఈ ఊరికి బస్సు రాలేదు అనే మాట నా దృష్టికి రావద్దని స్పష్టం చేశారు. ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యం అందేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో, తాగునీటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. రైతులకు ఆరుతడి పంటల సాగుపై విస్తృత అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో అధిక దిగుబడి వచ్చే పంటలను ప్రోత్సహించాలని తెలిపారు.
హుస్నాబాద్ మండలానికి సమీపంలో నర్మేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఉన్నందున, మండలంలోని గ్రామాల్లో ఆయిల్ ఫామ్ సాగును విస్తృతంగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుకు అందుబాటులో ఉన్న సబ్సిడీలు, విత్తనాలు, ఎరువులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ పిట్లు ఏర్పాటు చేసి భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామంలో జలశక్తి సంరక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నీటి సంరక్షణలో ముందుండే గ్రామాలు అభివృద్ధిలోనూ ముందంజలో ఉంటాయని పేర్కొన్నారు. రెండున్నర ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉన్న అర్హులైన రైతులు ప్రభుత్వ నిబంధనల మేరకు రూ.2.50 లక్షల సహాయంతో వ్యవసాయ బావులను తవ్వుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అదనపు తరగతి గదులు, కిచెన్ షెడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్య, సౌకర్యాలు అందించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి, మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి సమస్యను సమష్టిగా చర్చించి పరిష్కరించుకుందామని, హుస్నాబాద్ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో స్పెషల్ ఆఫీసర్ కొండల్ రెడ్డి, ఎంపీడీఓ సురేష్, ఏఎంసీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఫ్యాక్స్ చైర్మన్ శివయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ ఐలయ్య, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
