రాష్ట్రంలో ఎగుమతుల వృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి

  • ఎగుమతులకు అనుకూలమైన విధానాల అమలుపై ప్రత్యేక దృష్టి
  • రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ప్రధాన కార్యదర్శి  సంజయ్ జాజు

హైదరాబాద్, వెలుతురు జూలై 30:

రాష్ట్రంలో ఎగుమతుల వృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, కొత్త మార్కెట్ల అన్వేషణ, ఎగుమతులకు అనుకూలమైన విధానాల అమలుపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గురువారం సిఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన రాష్ట్ర ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (State Export Promotion Committee–SEPC) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమలు, తయారీ (మ్యానుఫ్యాక్చరింగ్) యూనిట్లు, వ్యవసాయం, ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్స్, హస్తకళలు, ఐటీ ఆధారిత సేవలు తదితర రంగాల ఎగుమతులను మరింత ప్రోత్సహించేందుకు అన్ని సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రధాన కార్యదర్శి సూచించారు.

ఎగుమతుల ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమివ్వడంతో పాటు తెలంగాణను దేశంలోని ప్రముఖ ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.1,22,655 కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయని అధికారులు సమావేశంలో తెలిపారు. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు, ఉద్యానవన పంటలు (హార్టికల్చర్), పౌల్ట్రీ ఉత్పత్తులు, వెజిటబుల్ సీడ్స్, రెడ్ చిల్లీ తదితర రంగాల్లో ఎగుమతులను గణనీయంగా పెంచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు మరింతగా ఎగుమతి చేసేందుకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని వివరించారు.

కేంద్ర ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) అధికారులతో సమన్వయం పెంపొందించి రాష్ట్ర ఎగుమతుల వృద్ధికి మరింత కృషి చేయాలని ప్రధాన కార్యదర్శి సూచించారు. ఈ సమావేశంలో పర్యాటక, సంస్కృతి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణ ఆదిత్య, రవాణా శాఖ కమిషనర్ ఇల్లంబర్తి, సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్ డా.జి.ముకుంద రెడ్డి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, ఎగుమతుల ప్రోత్సాహక సంస్థల ప్రతినిధులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.br

Leave A Reply

Your email address will not be published.