మహాలక్ష్మితో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

  • వేములవాడ బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు మంత్రులు, ప్రభుత్వ విప్ శంకుస్థాపన
  • కోరుట్ల మీదుగా బాసరకు ఎక్స్‌ప్రెస్ బస్సు ప్రారంభం
  • మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పక్కాగా అమలు
  • రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

వేములవాడ, వెలుతురు జూలై 30:

మహాలక్ష్మి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పక్కాగా అమలు చేస్తున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వేములవాడ తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు మంత్రులు మంత్రి పొన్నం ప్రభాకర్,  తుమ్మల నాగేశ్వరరావు,  అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం వేములవాడ–కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకుందన్నారు. మహిళల ఉచిత ప్రయాణంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపారు. కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు సిబ్బంది నియామకాలు కూడా చేపడుతున్నామని వెల్లడించారు. 1984లో నిర్మించిన వేములవాడ బస్‌స్టేషన్‌ను రూ.1.62 కోట్ల వ్యయంతో ఆధునీకరిస్తున్నామని చెప్పారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు రోజూ సుమారు 250 బస్సులు, 560 ట్రిప్పులు నడుస్తున్నాయని పేర్కొన్నారు.

కోరుట్ల మీదుగా బాసరకు కొత్త ఎక్స్‌ప్రెస్ బస్సును ప్రారంభించామని, గతంలో ముంబైకి కూడా బస్సు సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామని, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. రోజుకు 50 వేల మంది వేములవాడ బస్ స్టేషన్ నుంచి ప్రయాణం చేస్తున్నారని వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు 334.11 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి రూ. 11,668 కోట్లు ఆదా చేసుకున్నారని వెల్లడించారు. 2600 కొత్త బస్సులు కొనుగోలు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 కోట్లతో బస్ స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని, ఆర్టీసీ ఉద్యోగుల దాదాపు రూ.1000 కోట్ల పీఎఫ్ బకాయిలు, 600 కోట్ల సీసీఎస్ బకాయిలు చెల్లించామని వెల్లడించారు.

వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు బస్‌స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రజారవాణా సంస్థగా తెలంగాణ ఆర్టీసీ మహిళలకు ఉచిత ప్రయాణాన్ని విజయవంతంగా అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా వరుణ పూజలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇటీవల కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ మేరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అదే అభివృద్ధి దిశగా వేములవాడ తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు.

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ తిప్పాపూర్ బస్‌స్టేషన్ ఆధునీకరణకు రూ.1.62 కోట్లు మంజూరు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులు, ప్రయాణికులకు ఈ ఆధునీకరించిన బస్‌స్టేషన్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. గతంలో పలుమార్లు కూలిపోయిన బస్‌స్టేషన్ సమీప వంతెనను భూ నిర్వాసితులకు న్యాయం చేసి పూర్తి చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.249.40 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, సంజయ్ కుమార్, ఎస్పీ మహేష్ బి గితే, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.