- వ్యవసాయం, అనుబంధ రంగాల పరిరక్షణకు నిపుణుల కమిటీ కీలక సిఫార్సులు
- కార్యాచరణ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరం
- ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదిక అందజేసిన చిన్నారెడ్డి
హైదరాబాద్, వెలుతురు జూలై 30:
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, సాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలను పరిరక్షించేందుకు రూపొందించిన రాష్ట్ర స్థాయి సమగ్ర కార్యాచరణ నివేదికను నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి గురువారం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి బోధి సెంటర్‌లో అందజేశారు.
ఈ సందర్భంగా సచివాలయం మీడియా సెంటర్‌లో చిన్నారెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావం వల్ల రాష్ట్రంలో ఏర్పడే సవాళ్లను ముందుగానే అంచనా వేసి, వివిధ శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. రైతులకు నష్టం తగ్గించేలా నీటి వినియోగంలో పొదుపు, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, నాణ్యమైన విత్తనాల అందుబాటు, పశుగ్రాస భద్రత, ఉద్యాన పంటల విస్తరణ, వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు వంటి అంశాలకు నివేదికలో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు పేర్కొన్నారు.
గత మూడు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఆరుతడి పంటలు సాగు చేసిన రైతులకు ఊరటనిచ్చాయని ఆయన తెలిపారు. ఈ వర్షాలతో లభించిన తేమను, అందుబాటులోకి వచ్చిన నీటిని సమర్థవంతంగా వినియోగించుకొని ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతులు పంటలను విజయవంతంగా సాగు చేసుకునేలా ప్రభుత్వం అమలు చేయదగిన ఆచరణాత్మక సూచనలను కమిటీ ప్రభుత్వానికి అందజేస్తుందని చెప్పారు.
అనంతరం వివిధ శాఖల ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, పరిశోధనా సంస్థల ప్రతినిధులు సంయుక్తంగా రూపొందించిన నివేదికలోని ముఖ్యాంశాలను కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఈ నివేదికలో తక్షణ, మధ్యకాల, దీర్ఘకాల కార్యాచరణ ప్రణాళికలతో పాటు రైతుల జీవనోపాధి పరిరక్షణ, నీటి వనరుల సమర్థ వినియోగం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం, పశుగ్రాస భద్రత, గ్రామీణ ఉపాధి కల్పన వంటి అంశాలపై సమగ్ర సిఫార్సులు చేశారు. రాష్ట్రంలో సాధారణ నైరుతి రుతుపవనాల వర్షపాతం 740.60 మిల్లీమీటర్లు కాగా, జూలై 27 నాటికి 234.80 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదై, సాధారణంతో పోలిస్తే సుమారు 30 శాతం లోటు నమోదైనట్లు కమిటీ పేర్కొంది. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గడంతో పాటు భూగర్భ జలమట్టం కూడా గణనీయంగా పడిపోయినట్లు నివేదికలో వివరించింది.
వర్షాభావ పరిస్థితుల ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గినందున, నీటి అవసరం ఎక్కువగా ఉండే పంటలకు బదులుగా కందులు, పెసలు, మినుములు, మొక్కజొన్న, జొన్న, సజ్జలు, రాగులు, నూనెగింజలు, కూరగాయలు, పశుగ్రాస పంటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను గ్రామాల వారీ కార్యాచరణ ప్రణాళికతో విస్తృతంగా ప్రోత్సహించాలని కమిటీ సూచించింది. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలను 75 శాతం వరకు సబ్సిడీపై రైతులకు అందించాలని సిఫార్సు చేసింది.
వరి సాగును నీటి లభ్యత ఆధారంగా పరిమితం చేయడంతో పాటు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను విస్తృతంగా ప్రోత్సహించాలని, బ్రాడ్ బెడ్ అండ్ ఫరో, రిడ్జ్ అండ్ ఫరో, మల్చింగ్, వర్షపు నీటి సంరక్షణ, ఫార్మ్ పాండ్లు, భూగర్భ జలాల రీఛార్జ్ వంటి నీటి సంరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని నివేదిక సూచించింది. ఉద్యాన పంటల సాగును విస్తరించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు నీటి వినియోగాన్ని తగ్గించవచ్చని కమిటీ అభిప్రాయపడింది. తక్కువ వ్యవధి కూరగాయల సాగు, ఆయిల్‌పామ్, పండ్ల తోటలు, పట్టుపరిశ్రమ ఆధారిత సాగును ప్రోత్సహించాలని, డ్రిప్ ఇరిగేషన్, శాశ్వత పందిళ్లు, షేడ్‌నెట్ హౌస్‌లు, వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలకు సబ్సిడీలు అందించాలని సూచించింది.
పశుసంవర్ధక రంగంలో పశుగ్రాస కొరత తలెత్తకుండా జిల్లా వారీగా పశుగ్రాస బ్యాంకులు ఏర్పాటు చేయడం, మేత పంటల సాగును విస్తరించడం, సైలేజ్, హే తయారీ, అజోల్లా సాగు, పశుగ్రాస విత్తనాల పంపిణీ, అవసరమైతే పశు శిబిరాల నిర్వహణ, పశువులకు తాగునీటి వసతుల కల్పన వంటి చర్యలు చేపట్టాలని కమిటీ సిఫార్సు చేసింది.
గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెక్‌డ్యాంలు, ఫార్మ్‌పాండ్లు, చెరువుల పూడికతీత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ పనులను విస్తృతంగా చేపట్టి నీటి వనరులను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ కార్మికులకు ఉపాధి కల్పించాలని సూచించింది.
మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, జలాశయాల్లోని నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత కల్పించాలని నివేదిక పేర్కొంది.
వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, శాస్త్రవేత్తలు సమన్వయంతో రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సాంకేతిక సూచనలు నిరంతరం అందించాలని, గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ సూచించింది. అదేవిధంగా, సేంద్రియ ఎరువులు, జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించడం, వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటు, పంటలు, తాగునీరు, పశుగ్రాసం, విద్యుత్ సరఫరా, ప్రజారోగ్య పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. ప్రత్యామ్నాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అవసరమైతే మార్కెట్ జోక్యంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రతిపాదించిన ఈ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను తక్షణమే అమలు చేయడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తి, రైతుల జీవనోపాధి, తాగునీటి భద్రత, పశుగ్రాస లభ్యత, గ్రామీణ ఉపాధి పరిరక్షణతో పాటు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని మరింత స్థిరంగా నిలబెట్టవచ్చని కమిటీ పేర్కొంది. ఈ కార్యాచరణ ప్రణాళిక అమలుకు సుమారు రూ.802.92 కోట్ల నిధులు అవసరమవుతాయని నివేదికలో అంచనా వేసింది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, వ్యవసాయ శాఖ సీనియర్ అధికారులు కృపాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిలు పాల్గొన్నారు.

