- 2047 నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థే తెలంగాణ లక్ష్యం
- పదేళ్ల బీఆర్‌ఎస్ విధ్వంసాన్ని తుడిచిపెట్టి.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాం
- ప్రతి నెల 1వ తేదీనే ఉద్యోగుల వేతనాలు.. రూ. 1.20 కోట్ల ప్రమాద బీమా
- 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం ‘బ్రేక్‌ఫాస్ట్’.. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
- అమెరికాలో ఐఓసీ సమావేశంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్, అమెరికా, వెలుతురు ఆగస్టు 02:
తెలంగాణలో కొలువుదీరిన ప్రజా ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా ముందుకు తీసుకెళ్తోందని, రాష్ట్ర రూపురేఖలను మారుస్తూ ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అమెరికా పర్యటనలో భాగంగా జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) ప్రతినిధుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న విప్లవాత్మక అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తు ప్రణాళికలను విదేశీ ప్రతినిధులు, ఎన్ఆర్ఐలకు ఆయన వివరించారు.
3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. ‘భారత్ ఫ్యూచర్ సీటీ’
తెలంగాణను 2047 నాటికి $3 ట్రిలియన్ డాలర్లు, రాబోయే ఐదేళ్లలో $1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’విజన్ ప్లాన్‌ను అమలు చేస్తోందని తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు తోడుగా నాలుగో మహానగరంగా ముచ్చర్ల ప్రాంతంలో కాలుష్య రహిత నెట్-జీరో (Net-Zero) ప్రమాణాలతో ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ ని నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని కోర్ అర్బన్ (CURE), పెరి-అర్బన్ (PURE), రూరల్ అగ్రి (RARE) అని మూడు ఆర్థిక మండలాలుగా వర్గీకరించి వేగంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
‘యంగ్ ఇండియా’తో విద్యా రంగంలో విప్లవం
యువతను అంతర్జాతీయ స్థాయి నిపుణులుగా మార్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని వెల్లడించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామని తెలిపారు.
టాటా గ్రూప్ భాగస్వామ్యంతో రూ. 2,100 కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను (ITIs) హైటెక్ డిజిటల్ శిక్షణా కేంద్రాలుగా మారుస్తున్నట్లు వివరించారు. ఇప్పటికే మోడల్‌గా ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం పూట పౌష్టికాహార ‘బ్రేక్‌ఫాస్ట్’ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్మీడియట్ విద్యార్థులకు సైతం ‘మధ్యాహ్న భోజన’ సౌకర్యాన్ని విస్తరించామన్నారు.
ఆక్రమణలపై ‘హైడ్రా’ ఉక్కుపాదం.. మూసీకి పూర్వవైభవం
హైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థను తీసుకొచ్చామని, ప్రకృతి వనరులను కాపాడేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు ద్వారా మూసీ నదిని శుద్ధి చేసి, పర్యాటక, వాణిజ్య కేంద్రంగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టామని వెల్లడించారు.
గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక విచ్ఛిన్నతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్‌ఎస్ తీరు వల్ల గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 15 నుంచి 25వ తేదీ వరకు జీతాలు రాని పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కఠినమైన ఆర్థిక క్రమశిక్షణను పాటించి, విచ్ఛిన్నమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందని తెలిపారు. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 1.20 కోట్ల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నామని వెల్లడించారు.
ఆరు గ్యారెంటీలతో సుపరిపాలన
ఎన్నికలలో ఇచ్చిన ‘ఆరు గ్యారెంటీలను ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో వేగంగా అమలు చేస్తోందని, ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి నిర్ణయాలు సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపాయని వివరించారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయమే పునాదిగా సాగుతున్న తెలంగాణ పునర్నిర్మాణంలో విదేశాల్లో ఉన్న తెలుగు ఎన్ఆర్ఐలు, ఐఓసీ ప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి
రీజినల్ రింగ్ రోడ్డు (RRR) వేగవంతం చేయడం, మెట్రో రైలు రెండో దశ విస్తరణతో పాటు అంతర్జాతీయ పెట్టుబడులను భారీగా రాబట్టడం వల్ల తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలకు చేరిందని ఆయన వివరించారు. అమెరికాలోని తెలుగు ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు స్వరాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, శాసనసభ్యులు టి. రామ్మోహన్ రెడ్డి రాకేష్ రెడ్డి, కాలే యాదయ్య, దొంతి మాధవరెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
