- ఉత్సవాల నిర్వహణ కోసం బిచ్చమెత్తుకోవాలా?
- రంజాన్ పండుగకు రూ.33 కోట్లు… బోనాలకు రూ.20 కోట్లా?
- జంట నగరాల్లోనే 3 వేల పైచిలుకు దేవాలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి?
- ప్రభుత్వం ఇచ్చే నిధులు ఏ మూలకు సరిపోతాయి?
- కాంగ్రెస్ కు హిందూ పండుగలంటే అంత చులకన ఎందుకు?
- ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని రేవంత్ రెడ్డి మాటలే ఇందుకు నిదర్శనం
- బీఆర్ఎస్ సైతం బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం వహించింది
- జనాభా ప్రాతిపదికన పండుగలు, ఉత్సవాలకు నిధులను కేటాయించండి
- హిందూ సమాజమంతా జాగ్రుతం కావాల్సిన సమయం ఆసన్నమైంది
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్
- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి
హైదరాబాద్ వెలుతురు ఆగస్టు 02:
రాష్ట్రంలో హిందు పండుగలు, ఉత్సవాల నిర్వహణ కోసం హిందువులంతా బిచ్చమెత్తుకునే దుస్థితి నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యంత ఘనంగా నిర్వహించుకునే బోనాల ఉత్సవాల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ‘‘ బోనాల ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి వదిలేసింది. ఆ మేరకు నిధులు ఇవ్వాలనే సోయే లేదన్నారు. రంజాన్ పండుగ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు ఇచ్చి, 80 శాతానికిపైగా హిందువులు నిర్వహించుకునే బోనాల ఉత్సవాలకు మాత్రం రూ.20 కోట్లు మాత్రమే ఇస్తారా? హిందూ పండుగల కోసం హిందువులంతా బిచ్చమెత్తుకోవాలా?’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు, భక్తులు పెద్ద ఎత్తున ఆయనకు స్వాగతం పలికారు. దారి పొడవునా భక్తులు ఎండలో క్యూలో నిలబడటం, వారికి తాగునీళ్లుసహా కనీస సౌకర్యాలు లేని విషయాన్ని గమనించారు. సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్న అంశాన్ని పలువురు భక్తులు సంజయ్ దృష్టికి తెచ్చారు.
అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బోనాలు ప్రతీకని, రాష్ట్ర ప్రజలపై అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. సమృద్ధిగా వర్షాలు పడాలని వేడుకున్నానని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించారు సరే… మరి నిధులేవి? గత ప్రభుత్వంతోపాటు ఈ ప్రభుత్వం కూడా బోనాల ఉత్సవాల నిర్వహణ విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని, తెలంగాణలో హిందువుల జనాభా 80 శాతం కానీ ఆ స్థాయిలో నిధుల కేటాయింపు లేవి ? కేవలం రూ.20 కోట్లు మాత్రమే కేటాయిస్తారా? కనీస సౌకర్యాల్లేక భక్తులు అల్లాడుతున్నారని మండిపడ్డారు. భక్తులు ఎండకు తాళలేక ఇబ్బంది పడుతున్నారని, మంత్రులు, సీఎం ఉన్నది ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుని వెళితే సరిపోతుందా? భక్తుల బాధలు పట్టవా? అని అన్నారు.
సాక్షాత్తు సీఎం ‘కాంగ్రెస్ అంటేనే ముస్లిం… ముస్లిం అంటేనే కాంగ్రెస్’ అని చెప్పారంటే హిందువుల పట్ల కాంగ్రెస్ కు ఎంత చులకన ఉందో అర్ధం చేసుకోవచ్చని, రంజాన్ పండుగకు రూ.33 కోట్లు ఇచ్చి, 80 శాతమున్న హిందువుల పండుగ బోనాలకు మాత్రం రూ.20 కోట్లు ఇస్తారా ? హిందువులు కాంగ్రెస్ పాలనలో బిచ్చమెత్తుకోవాలా ? రేపు గణేష్ ఉత్సవాలు రాబోతున్నాయి. హిందువులంతా ఇట్లనే ఇబ్బంది పడాలా? ఇదేనా పాలనంటే? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాలు, గణేశ్ ఉత్సవాలతోపాటు హిందువుల పండుగలకు, ఉత్సవాలకు జనాభా నిష్పత్తి ప్రాతిపదికన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.



