- సికింద్రాబాద్ రంగంలో భవిష్యవాణి
- నాకు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతా
- ఈసారి భారీ వర్షాలతో అగ్నిప్రమాదాల ముప్పు
- మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం
- విగ్రహ ప్రతిష్ఠ చేయకపోవడంపై అమ్మవారి ఆగ్రహం
- భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరికలు
- 6 నెలల గడువు విధించిన మాతంగి స్వర్ణలత
హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 03:
సికింద్రాబాద్‌లోని ప్రముఖ క్షేత్రం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అత్యంత కీలకమైన, విశిష్టమైన ‘రంగం’ కార్యక్రమం అత్యంత శ్రద్ధాసక్తుల నడుమ వైభవంగా పూర్తయింది. ఈ సందర్భంలో పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత రాబోయే కాలం గురించి పలు కీలక హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది దేశంలో, రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని, భారీ వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని చెప్పారు. అగ్నిప్రమాదాలు, భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భవిష్యవాణి వినిపించే క్రమంలో మాతంగి స్వర్ణలత తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో తన విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని గతంలో మాట ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. తాను ప్రజలందరినీ కాపాడుతున్నప్పటికీ, తన మాటను ఎవరూ ఆచరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు అడ్డుపడినా సరే ఈసారి విగ్రహ ప్రతిష్ఠ చేయించుకుని తీరుతానని స్పష్టం చేశారు. సరైన సమయానికి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
“నేను ఈ రోజు సంతోషంగా రాలేదు, తీవ్రమైన కోపంతో వచ్చాను. నా విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని చెప్పి మాట తప్పారు. అలాంటప్పుడు మీ ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు చెప్పాలి? ఈ ఏడాది కుంభవర్షాలు ముంచెత్తుతాయి. ఆ వర్షాలకు ప్రజలు కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ప్రాణనష్టం, అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. నా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే ప్రజల కోరికలన్నీ నెరవేరుస్తాను. ఆరు నెలల వ్యవధిలో విగ్రహ ప్రతిష్ఠ జరగకపోతే వాడవాడలా ప్రాణనష్టం కలిగిస్తాను” అని మాతంగి స్వర్ణలత హెచ్చరించారు.
సమాజంలో మానవ సంబంధాలు, వావివరుసలు తగ్గిపోతున్నాయని, జనాలు ధర్మాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారని భవిష్యవాణిలో స్వర్ణలత పేర్కొన్నారు. ప్రజల్లో సంతోషం కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ప్రజలకు దోసెడంత ఇస్తుంటే, తన కోసం మాత్రం గోరంత కూడా చేయడం లేదని అన్నారు. అయితే పి చిన్న పిల్లలను, తనను నమ్ముకున్న ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అభయమిచ్చారు. ఆరు నెలల్లో విగ్రహం పెట్టకపోతే అడ్డొచ్చిన వారిని తొక్కిపారేస్తానని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల తదితరులు పాల్గొన్నారు.
రంగం కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, అమ్మవారి దయాకటాక్షాలు ప్రజలందరిపై ఉంటాయని మాతంగి భవిష్యవాణిలో తెలిపారని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు. భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండటం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడిందని తెలిపారు.జోగినీల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పొన్నం తెలిపారు. తమకు ప్రత్యేక గుర్తింపు కావాలని జోగినీలు కోరారని, భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వారికి ప్రత్యేకంగా ఐడీ కార్డులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వారిని కో-ఆప్షన్ సభ్యులుగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. మిగిలిన పాతబస్తీ, లాల్ దర్వాజా బోనాలలోనూ మెరుగైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ సికింద్రాబాద్ లష్కర్ బోనాల ఉత్సవాలను దేశవ్యాప్తంగా ప్రజలు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారని తెలిపారు. నిన్న ఉదయం నుంచి వేలాది మంది భక్తులు, మహిళలు నిష్ఠతో అమ్మవారికి బోనాలు సమర్పించారని చెప్పారు. రంగం భవిష్యవాణి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిందని, అనంతరం అమ్మవారి అంబారీ ఊరేగింపు నిర్వహించనున్నట్లు వివరించారు.ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి 200 ఏళ్లకు పైగా ఘనమైన సాంస్కృతిక చరిత్ర ఉందని, తరతరాలుగా ఇక్కడ బోనాల పండుగను ఎంతో వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని తలసాని గుర్తుచేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
