30 ఏళ్ల బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ జెండా

  • బీజేపీకి ప్రశాంత్‌ కిశోర్‌ షాక్‌
  • కమలం కంచుకోట బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో బైపోల్
  • 30 ఏళ్ల నుంచి వరుసగా గెలుస్తూ వస్తోన్న బీజేపీ

బీహార్, వెలుతురు, ఆగష్టు 03:

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ ప్రత్యక్ష ఎన్నికల తొలి పోరులో విజయం సాధించారు. బంకీపూర్ నియోజకవర్గం వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నితిన్ నబిన్ ఏప్రిల్ 2026లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నితీన్ నబిన్ అత్యంత సన్నిహితుడు, చిన్ననాటి స్నేహితుడైన నీరజ్ కుమార్ సిన్హా బరిలోకి దిగాడు. ఆర్జేడీ నుంచి రేఖా కుమారి గుప్తా, జనసూరజ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ బరిలో నిలిచారు.

ఈ నియోజకవర్గానికి జులై 30వ తేదీ ఉప ఎన్నిక జరిగింది. ఇవాళ (ఆగస్టు 3న) ఓట్ల లెక్కింపు జరిగింది. ప్రశాంత్ కిశోర్ తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై 18,953 ఓట్ల భారీ తేడాతో గెలిచి విజయదుందబి మోగించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ప్రశాంత్ కిషోర్ తొలిసారి చట్టసభల్లో అడుగుపెట్టనున్నారు. బీజేపీకి కంచుకోట అయిన నియోజకవర్గంలో ప్రశాంత్ కిషోర్ విజయం సాధించడం బీహార్ రాష్ట్ర రాజకీయాల్లోనేకాక దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలు ముఖ్యంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలు ఈ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఓటమికి ప్రధాన కారణంగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బీజేపీ కంచుకోట

బంకీపూర్ శాసనసభ నియోజకవర్గం బీజేపీకి కంచుకోట. 30ఏళ్లుగా బీజేపీ ఇక్కడ విజయం సాధిస్తుంది. 1995 నుంచి వరుసగా బీజేపీ అభ్యర్థులదే ఇక్కడ విజయం. గతంలో అది పాట్నా వెస్ట్ నియోజకవర్గం. ఆ తర్వాత 2010లో బంకీపూర్‌గా మారింది. 1995 నుంచి 2005 వరకు నవీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా (నితిన్ నబీన్ తండ్రి) వరుసగా నాలుగుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2006 నుంచి నితిన్ నబీన్ (2006 ఉప ఎన్నిక, 2010, 2015, 2020, 2025) ఎన్నికల్లో వరుసగా విజయం సాధించాడు.

Leave A Reply

Your email address will not be published.