ప్రధాని విదేశీ టూర్ల ఖర్చు రూ.550 ఖర్చు

  • ఐదేళ్ల వివరాలు వెల్లడించిన కేంద్రం
  • 2021 నుంచి విదేశీ పర్యటనలకు రూ.550 కోట్లకుపైగా ఖర్చు చేసినట్లు కేంద్రం వెల్లడి
  •  2025లో 23 దేశాల పర్యటనలకు రూ.187 కోట్లు వ్యయం అయినట్లు స్పష్టీకరణ
  • 2026లో ఇప్పటివరకు విదేశీ పర్యటనలపై రూ.74.58 కోట్లు ఖర్చు
  • రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ లిఖితపూర్వక సమాధానం
    విదేశీ పర్యటనలతో ద్వైపాక్షిక సంబంధాలు, పెట్టుబడులు పెరిగాయి
  • 2021-2025 మధ్య ఒప్పందాల ద్వారా 381 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
  • దేశ ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలకే విదేశీ పర్యటనలు

ఢిల్లీ. వెలుతురు, ఆగష్టు 6:

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలపై 2021 నుంచి ఇప్పటివరకు రూ.550 కోట్లకుపైగా ఖర్చు అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గెరిటా లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఈ వివరాలను వెల్లడించారు. విదేశీ పర్యటనలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, పెట్టుబడుల ఆకర్షణ, అంతర్జాతీయ భాగస్వామ్యాల విస్తరణకు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

వివరాల ప్రకారం.. 2025లో ప్రధాని మోదీ 23 దేశాల్లో పర్యటించగా రూ.187 కోట్లు ఖర్చు అయ్యాయి. 2024లో రూ.109 కోట్లు, 2023లో రూ.93 కోట్లు, 2022లో రూ.55 కోట్లు, 2021లో రూ.36 కోట్లు విదేశీ పర్యటనలకు వెచ్చించినట్లు కేంద్రం వెల్లడించింది. 2026లో ఇప్పటివరకు రూ.74.58 కోట్లు ఖర్చు అయినట్లు పేర్కొంది.

ఈ ఏడాది జులై 6 నుంచి 11 వరకు ఇండోనేసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. గత ఏడాది ఫ్రాన్స్‌, అమెరికా, సౌదీ అరేబియా, బ్రెజిల్‌, చైనా, బ్రిటన్‌తో పాటు మారిషస్‌, థాయ్‌లాండ్‌, శ్రీలంక, సైప్రస్‌, కెనడా, క్రొయేషియా, ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, నమీబియా, మాల్దీవులు, జపాన్‌, భూటాన్‌, దక్షిణాఫ్రికా, జోర్డాన్‌, ఒమన్‌, ఇథియోపియా వంటి దేశాల్లో అధికారిక పర్యటనలు నిర్వహించినట్లు వెల్లడించింది.

దేశాల వారీగా చూస్తే.. ఫ్రాన్స్‌ పర్యటనకు రూ.25 కోట్లు, బ్రెజిల్‌కు రూ.17 కోట్లు, అమెరికాకు రూ.16 కోట్లు, సౌదీ అరేబియాకు రూ.15 కోట్లు, చైనా పర్యటనకు రూ.10 కోట్లు, బ్రిటన్‌కు రూ.9 కోట్లు ఖర్చు చేసినట్లు విదేశాంగ శాఖ వివరించింది.

2021 నుంచి 2025 డిసెంబర్‌ వరకు జరిగిన విదేశీ పర్యటనల సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాల ఫలితంగా 381 బిలియన్ డాలర్ల (రూ.30 లక్షల కోట్లకుపైగా) విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారత్‌కు వచ్చినట్లు కేంద్రం తెలిపింది. అంతర్జాతీయ వేదికలపై భారత భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, వ్యాపార, పెట్టుబడి అవకాశాలను పెంచడం, వ్యూహాత్మక సంబంధాలను విస్తరించడం వంటి అంశాలకు ఈ పర్యటనలు దోహదపడుతున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది.

Leave A Reply

Your email address will not be published.