చేనేతకు ప్రోత్సాహంతో బతుకమ్మ వేడుకలు: ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్
హైదరాబాద్, సెప్టెంబర్ 19: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను చేనేత కార్మికులకు అండగా నిలిచే సామాజిక బాధ్యతతో అనుసంధానిస్తూ లండన్‌లో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) నిర్వహించనున్న ‘టాక్ చేనేత బతుకమ్మ–దసరా 2026’ వేడుకల పోస్టర్‌ను ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. తెలంగాణ పండుగలు, కళలు, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడంలో ప్రవాస తెలంగాణ సమాజం చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, తరతరాలుగా వస్తున్న కళా నైపుణ్యానికి, శ్రమకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని అన్నారు. చేనేతకు బతుకమ్మను అనుసంధానం చేస్తూ టాక్ నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా చేనేత కళాకారులకు ప్రోత్సాహం లభించడంతో పాటు తెలంగాణ చేనేత ప్రత్యేకత అంతర్జాతీయ వేదికపై మరింతగా పరిచయం అవుతుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ కాలం నుంచి లండన్ వేదికగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో టాక్ వ్యవస్థాపకుడు, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఆయన బృందం చేస్తున్న కృషిని దేశపతి శ్రీనివాస్ అభినందించారు. టాక్ చేపడుతున్న సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమా మాట్లాడుతూ బతుకమ్మ తెలంగాణ మహిళల ఐక్యత, ఆత్మగౌరవం, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. బతుకమ్మతో పాటు తెలంగాణ చేనేతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా చేనేత కళాకారుల శ్రమ, నైపుణ్యానికి గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. యూకేలో నివసించే ప్రవాస ఆడబిడ్డలంతా వేడుకల్లో పాల్గొని, మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలన్నారు.
తెలంగాణ అధికార భాషా సంఘం మాజీ చైర్‌పర్సన్ మంత్రి శ్రీదేవి మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు మహిళలు బతుకమ్మను పేర్చి, పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా వేడుకలు నిర్వహించడం తెలంగాణ సంస్కృతిలో ప్రత్యేకత అన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సైతం బతుకమ్మను ఘనంగా నిర్వహిస్తూ భావితరాలకు మన సంస్కృతి, సంప్రదాయాలను పరిచయం చేయడం అభినందనీయమని తెలిపారు.
ప్రముఖ రచయిత, గాయకుడు మానుకోట ప్రసాద్‌తో పాటు పాల్గొన్న మహిళా నాయకులు మాట్లాడుతూ లండన్ వంటి అంతర్జాతీయ నగరంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ద్వారా తెలంగాణ సంస్కృతి, మహిళల సంప్రదాయాలు, పండుగల విశిష్టతను ఇతర సమాజాలకు పరిచయం చేసే అవకాశం లభిస్తుందని అన్నారు. చేనేత కార్మికులకు సామాజికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
టాక్ వ్యవస్థాపకుడు, ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, తుల ఉమా, మంత్రి శ్రీదేవి, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, స్థానిక నాయకులు, లండన్ ఎన్నారైలకు కృతజ్ఞతలు తెలిపారు.
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ 2026 అక్టోబర్ 17న శనివారం మధ్యాహ్నం 1 గంట నుంచి లండన్‌లోని హౌన్స్లో, లాంప్టన్ స్కూల్ (TW3 4EP)లో ‘టాక్ చేనేత బతుకమ్మ–దసరా 2026’ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. యూకే నలుమూలల నుంచి ప్రవాస తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు సుశీల రెడ్డి ముక్తవరం, జిహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ హేమ సామల, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాజ్‌కుమార్ శానబోయిన, శ్రీనివాస్ వల్లాల, రజిత రెడ్డి, అర్పిత, ఖుషి సమ్ము, మల్లేష్ పప్పుల, నరేష్ గౌడ్, రాజేష్ శామకూర, టాక్ ప్రతినిధులు పృథ్వీ రావుల, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.







