హైదరాబాద్, వెలుతురు, ఆగష్టు 7:
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితులు, సిద్ధాంతులు నిర్ణయించిన ముహూర్తం మేరకు ఈ నెల 10న నాగార్జున సాగర్‌లో రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో వరుణ యాగం నిర్వహించనున్నారు.
నాగార్జునసాగర్ డ్యామ్ తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో యాగం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట దేవస్థానం అర్చకులు, వేదపండితులు, నిర్ణయించిన ముహూర్తంలో యాగ క్రతువులను నిర్వహిస్తారు. కృష్ణా, గోదావరి నదులు, చెరువులు జలకళ సంతరించుకోవాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలన్న సంకల్పంతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. యాగం అనంతరం మహత్తర పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
